అనంతపురం ప్రతినిధి : ఖరీఫ్ సాగుకు సంబంధించి వేరుశనగ సబ్సిడీ విత్తన పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా గ్రామాల పరిధిలోనే రైతుభరోసా కేంద్రాల్లో విత్తనం అవసరమైన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషస్ అయిన వెంటనే రైతులు తమ వాటా డబ్బులు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో జమ చేయాల్సి ఉంటుంది. గతంలో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుకాక ముందు విత్తన పంపిణీ సమయంలో రైతులు వారి వాటా డబ్బులు చెల్లించి విత్తనం తీసుకునే వారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విత్తన పంపిణీ ప్రక్రియ మొత్తాన్నీ మార్చివేసింది. రైతుభరోసా కేంద్రాల్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమ వాటా డబ్బులు ముందుగా చెల్లిస్తే గ్రామం పరిధిలోనే విత్తనాన్ని రైతులకు అందజేయడం జరుగుతోంది. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిన పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతుభరోసా కేంద్రాల వారీగా డిమాండ్‌ను అంచనా వేసి కేటాయింపులను అధికారులు పూర్తి చేశారు. కె-6 , కదిరి లేపాక్షి 1812 రకం రెండు రకాలు పంపిణీ చేపట్టనున్నారు. కె-6 సేకరణ ధర కిలో రూ.93 కాగా సబ్సిడీ 40 శాతం ప్రభుత్వమిస్తోంది. దీని ప్రకారం కిలోకు రైతు రూ.55.80 చొప్పున తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక కదిరి, లేపాక్షి రకం సేకరణ ధర రూ.83 కాగా సబ్సిడీ 40 శాతం ప్రకారం రైతు తన వాటాగా కిలోకు రూ.49.80 చొప్పున ముందుగా రైతు భరోసా కేంద్రంలో చెల్లించాలి. 30 కిలోల బస్తా అర ఎకరంలోపు అయితే ఒకటి, అర ఎకరా నుంచి ఒక ఎకరా వరకు అయితే రెండు బస్తాలు, ఆపైన ఎంతున్నా మూడు బస్తాలు మాత్రమే గరిష్టంగా ఒక్కో రైతుకు ఇవ్వటం జరుగుతుంది. అనంతపురం జిల్లాకు సంబంధించి 78450 క్వింటాళ్ల విత్తనాన్ని కేటాయించారు. ఈ స్టాకును సేకరించే పనిని ఎపిసీడ్స్ చేపడుతోంది.
ఇప్పటి వరకు 300 క్వింటాళ్లు పొజిషన్
అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 300 క్వింటాళ్లు మాత్రమే పొజిషనింగ్ ఉంది. అది కూడా నాలుగు రైతు భరోసా కేంద్రాల పరిధిలోనే స్టాకుంది. బ్రహ్మసముద్రం, రాప్తాడు మండలాల పరిధిలోని నాలుగు రైతుభరోసా కేంద్రాల్లో ఈ స్టాకుంది. తక్కిన చోట ఇంకా స్టాకు రావాల్సి ఉంది. ప్రభుత్వం గత వారంలోనే విత్తన సేకరణ, సబ్సిడీ ధరలను నిర్ధారించింది. దీంతో సేకరణ ప్రక్రియ కూడా ఆలస్యంగానే ప్రారంభమైంది. గతంలో మన విత్తనం సొంత విత్తనం కూడా లేకపోవడంతో పూర్తిగా బయట నుంచి విత్తన సేకరణ చేపట్టాల్సింది. టెండర్లు కూడా ఖరారై ఉండటంతో ప్రయివేటు సంస్థల చేత మొత్తం విత్తన సేకరణ చేపట్టాల్సి ఉంది.
కంది, ఆముదం ఇంకా లేనట్టే
జిల్లాలో వేరుశనగతోపాటు అంతర పంటగానూ, పూర్తి పంటగానూ ఇటీవలి కాలంలో కంది, ఆముదం పంటల సాగు పెరిగింది. సాధారణంగా అయితే వేరుశనగతోపాటు ఈ విత్తనాలు పంపిణీ చేస్తే రైతుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కంది ధరను ఇంత వరకు ప్రభుత్వం నిర్ణయించలేదు. దీంతో పంపిణీ జాప్యం జరిగే అవకాశముంది. కేటాయింపులు మాత్రం అనంతపురం జిల్లాకు 4300 క్వింటాళ్లు జరిపారు. ఆముదం పంటకు ప్రభుత్వం సబ్సిడీతో ఇవ్వదు. బహిరంగ మార్కెట్ ప్రకారమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విత్తనాలతోపాటు పంపిణీ చేస్తే రైతులు ఒకేసారి కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. రైతుల నుంచి డిమాండ్ వస్తే అప్పుడు ఆముదం విత్తనాన్ని తెప్పిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్ తెలిపారు.










