అనంతపురం : అనంతపురం నగరంలోని పలు విత్తనాల దుకాణాలను జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రావణి ఎంటర్‌ప్రైజస్ విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేశారు. నాణ్యత లేని విత్తనాలు, అధిక ధరలకు విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే విత్తనాలను అమ్మిన షాపులను సీజ్ చేస్తామన్నారు. ప్రతి షాప్ యజమాని తప్పకుండా స్టాక్ రిజిస్టర్లను నిర్వహించాలన్నారు.
శ్రావణి సీడ్స్ పై 6ఎ కేసు నమోదు
నగరం లోని శ్రావణి ఎంటర్ ప్రైజస్ దుకాణంలో జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన కుసుంభర్ కళాశా రెండు కిలోలు, కళాశా బెండ సీడ్ 56 కేజీలు, కళాశా కళింగర విత్తనం ఎనిమిది కిలోలు, లేపాక్షి అగ్రిజెనిటిక్స్ కంది విత్తనం 249 కిలోలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.9.40 లక్షల విలువైన విత్తనాన్ని సీజ్ చేయడమే గాకుండా శ్రావణి సీడ్స్ దుకాణంపై 6ఎ కేసు నమోదు చేసినట్లు అనంతపురం డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ ఎం.రవి, ఏవో.శిశికళ తెలిపారు.
రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలను అందించాలి
రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తన కాయలు అందించాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ వ్యవసాయ అధికారులనుకు ఆదేశించారు. గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ నగరంలోని హిమబిందు వేరుశనగ విత్తన ప్రాసెసింగ్ యూనిట్‌ను తనిఖీ చేశారు. విత్తన నాణ్యతను పరిశీలించారు. విత్తన ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రవి, ఏపీ సీడ్స్ మేనేజర్ ధనలక్ష్మి, అనంతపురం మండల వ్యవసాయ అధికారి శిశికళ తదితరులు పాల్గొన్నారు.










