Jun 14,2022 22:16

'విత్తం' భరించలేక.. విత్తేందుకు సాహసించక...
అన్నదాతను వెంటాడుతున్న కష్టాలు
తగ్గనున్న ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

ఖరీఫ్‌కు సాగుకు కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రతి ఏటా అన్నదాతలకు పెట్టుబడి గుదిబండగా మారిపోతోంది. గతంతో పోల్చితే ఖర్చులు పెరుగుతున్నాయి. విత్తనాలు, ఎరువుల ధరలు మూడింతలయ్యాయి. ఆఖరున పంట మాత్రం అరకొరగానే అందుతోంది. అష్టకష్టాలు పడి, చెమటోడ్చి కష్టపడితే ఆఖరుకు పంట చేతికొచ్చే సరికి రైతుల కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. దీంతో వేరుశనగ సాగుచేయడానికి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కువ మంది విత్తనాలు విత్తేందుకు తటపటాయిస్తున్నాయి.
వెంటాడుతున్న కష్టాలు
గత ఏడాది వేరుశనగ పంట బాగా వచ్చింది. అయితే ఆఖరు సమయంలో పంట కోతలప్పుడు విపరీతంగా వర్షాలు పడ్డాయి. దీంతో పొలాల్లోనే విత్తనాలు మొలకలొచ్చే పరిస్థితులు నెలకున్నాయి. పెట్టుబడి మొత్తం ఆవిరైపోయింది. దీంతో ఈ సారైనా పంట బాగా పండుతుందని ఆశగా రైతులు ఖరీఫ్‌వైపు అడుగులేస్తున్నారు. వర్షాభావం వస్తుందనే భయం వెంటాడుతోంది. ఖరీఫ్‌ ప్రారంభమై 15 కావస్తున్నా ఇప్పటికీ ఎక్కువ మంది విత్తేందుకు తటపటాయిస్తున్నారు. వర్షాలు ఆశించిన మేరకు పడడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నా రైతుల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు.
ధరల మంట
కాగా వేరుశనగ విత్తేందుకు సన్నద్ధమవుతున్న రైతులకు ధరలు మంట పెట్టిస్తున్నాయి. పెట్టుబడి భారంగా మారుతోంది. సాధారణంగా సాగు మొత్తం ఎక్కువగా యంత్రాలపైనే ఆధారపడుతుంటారు. డీజల్‌ ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దుక్కులు దున్నేందుకు ఎక్కువ మంది ట్రాక్టర్లపైనే ఆధారపడుతూ ఉంటారు. గత ఏడాది రూ.80 ఉండే డీజిల్‌ ధరలు ప్రస్తుతం రూ.100 పలుకుతోంది. దీంతో బాడుగలు పెరిగాయి. గంటకు రూ.600 నుంచి రూ.1000 దాకా పెరిగిపోయాయి. దీంతో వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక ఎరువుల ధరలూ భగ్గుమంటున్నాయి. గత ఏడాది కన్నా 30 నుంచి 35 శాతం దాకా పెరిగాయి. పెరిగిన ధరల నేపథ్యంలో ఎకరా వేరుశనగ విత్తేందుకు రూ.30వేల దాకా ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఇదే ఇది వరకు రూ.15వేలే ఉండేదని, ఇప్పుడు పెట్టుబడి రెట్టింపు అయ్యిందని వారు అంటున్నారు.
సాగు విస్తీర్ణంపై ప్రభావం
ప్రస్తుతం పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గుతుందని తెలుస్తోంది. ఈ ఖరీఫ్‌లోఅన్ని పంటలూ కలిపి64,514 హెకార్టల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వేరుశనగ 55,661 హెక్టార్లలో సాగవుతుందని చెబుతున్నారు. ఇందులో 20 నుంచి 25 శాతం మేరకు తగ్గొచ్చని రైతు నాయకులు చెబుతున్నారు.
ధరలు పెరిగిపోయాయి
గతంలో పోల్చితే సేద్యం చేసేకి ధరలు బాగా పెరిగిపోయినాయి. దుక్కి దున్ని, విత్తనాలు విత్తి, కలుపు తవ్వి, పంట చేతికి వచ్చే సరికి రూ.30వేలు పైనే అయ్యేటట్లు ఉండాది. ఇంత పెట్టుబడి పెట్టాలంటే కష్టంగా ఉంది.
- గంగయ్య, రైతు బంగారుపాళ్యం