Aug 18,2023 21:26

మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్‌లో పరికరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమి

      అనంతపురం కలెక్టరేట్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలు మరింత విస్తరించేందుకు మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్‌ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ ఎం.గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌ ప్రాంగణంలో కెనడియన్‌ రెడ్‌ క్రాస్‌ వారిచే ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, జిల్లా శాఖకి అందజేసిన మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్‌ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్‌లో అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నాయన్నారు. జిల్లాలో ఎక్కడ రక్త దాతలు ఉన్న బస్సు అక్కడికి వెళ్లి బస్సులోనే శాంపిల్స్‌ సేకరించేందుకు ఆకాశముంటుందని చెప్పారు. ఇందులో రక్తమార్పిడి సౌకర్యం కూడా ఉందన్నారు. 100 శాంపిల్స్‌ స్టోర్‌ చేసుకునే రెఫ్రిజిరేటర్‌ కూడా ఈ వ్యాన్లో అమర్చబడి ఉందన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల వారు కూడా మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్‌ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఉంది ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడి రక్తం అవసరం ఉన్న సమయాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ఈ వ్యాన్‌ ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైస్‌ఛైర్మెన్‌ డా||లక్ష్మణ్‌ ప్రసాద్‌, సెక్రెటరీ మోహన్‌ కష్ణ, కోశాధికారి మల్లికార్జున, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్‌ఒ డా||యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.