Oct 03,2023 22:42

వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: వందేభారత్‌ సెమీ హైస్పీడ్‌ రైలును భువనేశ్వర్‌-విశాఖపట్నం మధ్య నడపాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ రైలుకు శ్రీకాకుళం రోడ్డులో హాల్ట్‌ సౌకర్యం కల్పించాలన్నారు. దీని వల్ల ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కతిక సంబంధాలు మరింత మెరుగు పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హాతో ఢిల్లీలో మంగళవారం భేటీ అయి వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రయాణికులకు రైలు సౌకర్యాలకు సంబంధించి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి రోజూ వేలాది మంది హైదరాబాద్‌కు రాకపోక లు సాగిస్తుంటారని తెలిపారు. భువనేశ్వర్‌ - సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గతంలో పది స్లీపర్‌ కోచ్‌లు ఉండేవని, వాటిని కుదించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాధారణ, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని స్లీపర్‌తో పాటు జనరల్‌ బోగీలనూ పెంచాలని కోరారు. భువనేశ్వర్‌ - పలాస మధ్య రాకపోకలు సాగిస్తున్న రైలును శ్రీకాకుళం రోడ్డు వరకు పొడిగించాలని విజ్ఞపి చేశారు. విశాఖ - పలాస మధ్య నడుస్తున్న రైలును ఇచ్ఛాపురం వరకు పొడిగించాలని కోరారు. హౌరా - యశ్వంతపూర్‌ రైలుకు ఇచ్ఛాపురంలో, రౌర్కెలా - గుణుపూర్‌ (రాజ్యరాణి) ఎక్స్‌ప్రెస్‌కు పాతపట్నంలో, భువనేశ్వర్‌-రామేశ్వరం రైలుకు శ్రీకాకుళం రోడ్డు, పలాసలో, హౌరా - మైసూరు సూపర్‌ఫాస్ట్‌ రైలుకు శ్రీకాకుళం రోడ్డులో, భువనే శ్వర్‌-విశాఖపట్నం (ఇంటర్‌ సిటీ) ఎక్స్‌ప్రెస్‌కు హరిశ్చంద్ర పురంలో హాల్ట్‌ కల్పించాలని కోరారు. విశాఖ-వారణాసి మధ్య రైలు నడిపేందుకు ఆమోదంపై కృతజ్ఞతలు తెలిపారు.