
ప్రజాశక్తి- పలాస, రణస్థలం, కొత్తూరు: ప్రభుత్వరంగ పరిశ్రమగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని చూస్తుందని, ప్రయివేటీకరణ విధానా న్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 20 నుంచి ఉత్తరాంధ్ర బైక్ యాత్ర నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహనరావు పిలుపునిచ్చారు. కాశీబుగ్గలో ఆదివారం బైక్ యాత్ర పోస్టర్‌ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం అనేక పోరాటాల ఫలితంగా ప్రజల బలిదానంతో ఏర్పాటు చేయచేసిన ప్రభుత్వ రంగ కర్మాగారమని తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దానిని ప్రయివేటు కార్పొరేట్లకు అమ్మేయాలని చూస్తుందన్నారు. ప్రభుత్వానికి రెవెన్యూ లోటు ఏర్పడి, కార్మికులకు ఉద్యోగ భద్రత లేక, భవిష్యత్ తరాలకు ఉపాధి లేకుండా చేసే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఉండి ఉత్తరాంధ్ర, రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను కాపాడుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగమని అన్నారు. ప్రయిటీకరణకు వ్యతిరేకంగా గత వెయ్యి రోజులుగా రిలే నిరాహారదీక్షలు జరుగుతున్నాయని వివరించారు. కేంద్రం ప్రభుత్వం ఈ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్య పరుస్తూ బైక్ ర్యాలీ చేపడుతున్నామని, 22న సాయంత్రం నాలుగు గంటలకు కాశీబుగ్గకు ఈ బైక్ ర్యాలీ చేరుతుందని తెలిపారు. ర్యాలీలో పాల్గొని ఉక్కు పరిశ్రమను కాపాడు కోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్.గణపతి, వి.కృష్ణారావు, పి.పరుశురాం, డి.కిషోర్, ఎ.వీరాస్వామి పాల్గొన్నారు.
అలాగే ఈ నెల 20న సాయంత్రం ఎచ్చెర్లలో ప్రారంభం కానున్న ఉక్కు రక్షణ బైక్ యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ నాయుకులు వెలమల రమణ, సిహెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలం సిపిఎం కార్యాలయం వద్ద బైక్ ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ నెల 23న కొత్తూరులో సాయంత్రం నిర్వహించనున్న విశాఖ ఉక్కు రక్షణ బైక్ యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు సిర్ల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బైక్ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిమ్మక అప్పన్న, బి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.