Oct 29,2023 00:03

మాట్లాడుతున్న వేణుగోపాల్‌

ప్రజాశక్తి- పలాస: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ నవంబరు 8న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జయప్రదం చేయాలని విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర నాయకులు ఎం.యుగంధర్‌, ఎం.వినోద్‌లు పిలుపునిచ్చారు. శనివారం పలాసలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ అనేక త్యాగాలతో విద్యార్థి యువజన నాయకులు 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను మోడి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబరు 18వ తేదీ నాటికి వెయ్యి రోజులు అవుతుందన్నారు. ఈ సందర్భంగా నవంబరు 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానిక యువతకి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సిపిఐ జిల్లా నాయకులు చావర వెంకటరమణ, చావర వేణుగోపాల్‌, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకు లు వంకల మాధవరావు, సిపిఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు మద్దిల రామారావు బాలకృష్ణ, ప్రజాసంఘ నాయకులు కుసుమ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బడ్డ నాగరాజు, కాంగ్రెస్‌ నాయకులు శ్యామ్‌, కష్ణలు పాల్గొన్నారు.