Apr 18,2023 21:04

సిపిఎం, సిపిఐ ప్రచార భేరిలో నేతలు
ప్రజాశక్తి - కాళ్ల
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను తక్షణం ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం, సిపిఐ చేపట్టిన రాజకీయ ప్రచారభేరి మండలంలో ఐదో రోజు మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడగా మండా సూరిబాబు, తిరుమాని శ్రీను, గరికముక్కల ఆజమ్మ, పుచ్చకాయల వజ్రమ్మ, ఉన్నమట్ల శాంతమ్మ, బాతు రామస్వామి, యోహోషువా, దేవరకొండ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆకివీడు: దేశంలో ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుదాం అనే నినాదంతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచార భేరి యాత్ర మూడో రోజు సోమవారం సాగింది. యాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ మోడీ అధికారంలోకొచ్చాక గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అదానీ, అంబానీలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, నేతలు షేక్‌ వలీ, బొడ్డుపల్లి రాంబాబు, డి.రవితేజ, వాసంశెట్టి సత్యవతి, బి.వర్మ పాల్గొన్నారు.
అత్తిలి: మన రాష్ట్రానికి మోడీ చేస్తున్న ద్రోహం అంతాఇంతా కాదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అన్నారు. మంగళవారం అత్తిలి మండలం ఉనికినిలో సిపిఎం ఆధ్వర్యాన ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా కేతా గోపాలన్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఏఒక్కటీ అమలు చేయని ఘనత మోడీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నేతలు మల్లిపూడి రామాంజనేయులు, గూడూరి రాంబాబు, దొంగ దుర్గారావు, సిహెచ్‌.రామకృష్ణ, బి.శ్రీను, జి.రవి పాల్గొన్నారు.
పెనుమంట్ర: రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని స్థితిలో రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన ఉన్నాయని సిపిఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు అన్నారు. మంగళవారం సోమరాజు ఇల్లింద్రపర్రులో ప్రచార భేరి యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు దిద్దే వెంకట్రావు, పాలా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆచంట: మతోన్మాద బిజెపి పాలనకు దేశంలోని ప్రజలంతా చరమగీతం పాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఎం మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌ అన్నారు. మోడీని గద్దె దించండి.. దేశాన్ని కాపాడండి నినాదంతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచారభేరి యాత్ర మంగళవారం కొడమంచిలి, కోడేరు, ఉత్తరపాలెం, టి.మెరక, తామరచెరువు, పెదమల్లం, మిద్దేవారిపాలెం, చినమల్లం, గరువు, చింతలతోట, పైపోరా, కింద పోరా, ఆచంట చినపేట వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కర్రపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతాన్ని అడ్డుపెట్టుకొని కుల, మత, ప్రాంతాల మధ్య చీలికలు తెచ్చేలా పరిపాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు అతి కారుచౌకగా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌, సిపిఐ జిల్లా నాయకులు పిసి.జోషి, సిపిఎం నేతలు సిర్రా నరసింహమూర్తి, వద్దిపర్తి అంజిబాబు, ఎస్‌విఎన్‌.శర్మ, ఇందుకూరి సూర్యనారాయణరాజు, తోటపల్లి సత్యనారాయణ, బొర్రా ధర్మారావు, వాసా రామ్మోహన్‌రావు, తలుపూరి బుల్లబ్బాయి, కొండేటి సత్యనారాయణ, సిర్రా విఘ్నేశ్వరుడు కొండేటి రాఘవులు, కారిపల్లి రాజు పాల్గొన్నారు.
తణుకు రూరల్‌: విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు బొద్దాని నాగరాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక నరేంద్ర సెంటర్‌లో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కుపై బిజెపి ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతాప్‌, నాగరాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని రక్షించడం మానేసి అమ్మేయడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.దక్షిణామూర్తి, పిఎల్‌.నర్సింహారావు, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి, ఎన్‌.ఆదినారాయణబాబు, వి.వెంకటేశ్వరరావు, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ కార్యదర్శి ఎం.రమేష్‌, ప్రసాద్‌, టి.రామకృష్ణ, త్రిమూర్తులు, రమణ, సాంబశివరావు, శ్రీహరి, ఎఐటియుసి నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి యాత్ర కుంచనపల్లి, కెఎస్‌ఎన్‌ కాలనీలో మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఇరు పార్టీల నేతలు మడక రాజు, కరెడ్ల రామకృష్ణ, శిద్దిరెడ్డి శేషుబాబు, చిట్టేటి సత్యనారాయణ, పోతు శ్రీను, అల్లం రాము, దాస్యం రాము, రావూరి బాబీ, ఉయ్యూరి సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రచార యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం దండగర్రలో ఆర్‌బికె వద్ద నిరసన తెలిపారు. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని నినదించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాలుపూరి సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి ఉల్లంకల జయకృష్ణ, సిపిఎం నేత కండెల్లి సోమరాజు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు గోపాల వెంకటరావు, కండెల్లి రమేష్‌బాబు, పి.జయమ్మ, సిపిఐ నాయకులు కర్రి సోమేశ్వరరావు, బందుల తాతయ్య, మద్ది సోంబాబు పాల్గొన్నారు.
పాలకోడేరు: రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వేండ్రలో సిపిఎం, సిపిఐ చేపట్టిన రాజకీయ ప్రచారభేరి మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం గోపాలన్‌ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్లకు అనుకూల విధానాలు అవలంబిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆసిరియ, నాయకులు వైఎస్‌ఎన్‌.మూర్తి, తాడి రామారావు, అప్పారావు, లక్ష్మణస్వామి, సిపిఐ నాయకులు ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఉండి: ఐకమత్యంగా ఉంటున్న ప్రజల్లో మతోన్మాదాన్ని నింపుతున్న బిజెపిని తరిమికొట్టాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్‌ఆర్‌పి.అగ్రహారంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ప్రచారభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్‌, సిపిఐ ఏరియా కార్యదర్శి కలిశెట్టి వెంకట్రావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నిత్యావసరాల ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చిన మోడీ ధరల నియంత్రణలో దారుణంగా విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొల్లి రత్నకుమారి, కొట్టాడ వెంకటేశ్వరరావు, మజ్జి నాగేశ్వరరావు, కాల్వ ఏసు, బొడ్డుపల్లి ఆదాం, దుర్గాతి రమణ, సిపిఐ నాయకులు సనపల శ్రీనివాస్‌, పతివాడ దుర్గ గణపతి, వంజరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.