Sep 26,2023 21:57

రామ్మోహన్‌ నాయుడు, ఎంపీ

* ఆమోదం తెలిపిన రైల్వేశాఖ
* ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వెల్లడి
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్లేందుకు వీలుగా సంబల్‌పూర్‌ నుంచి బనారస్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలును విశాఖ వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపిందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన మంగళవారం సందేశం విడుదల చేశారు. ఉత్తరాంధ్రవాసుల చిరకాల డిమాండ్‌ నేరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రవాసులు వారాణిసికి వెళ్లేందుకు నేరుగా రైలు సౌకర్యం లేదని, విజయవాడ నుంచి గానీ భువనేశ్వర్‌ నుంచి వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. దీంతో వృద్ధులు, మహిళలు వ్యయప్రయాసలకు గురికావడం, ప్రయాణాన్ని విరమించుకోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. విశాఖ నుంచి వారణాసికి రైలు నడపాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ శ్రీవైష్ణవ్‌, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోనల్‌, డివిజన్‌ సమావేశాల్లో పలుమార్లు లేవనెత్తానని తెలిపారు. వినతిని పరిగణనలోకి తీసుకున్న రైల్వేశాఖ రైలు పొడిగింపునకు ఆమోదం తెలిపిందని కృతజ్ఞతలు తెలిపారు. వారానికి రెండు రోజుల పాటు (బుధ, శనివారాలు) ఒడిశాలోని సంబల్‌పూర్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఇకపై విశాఖ నుంచి అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. విశాఖ, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, సంబల్‌పూర్‌ రైల్వేస్టేషన్ల మీదుగా వారణాసికి చేరుకోవచ్చని తెలిపారు. ఈ రైలు సేవలతో ఇరు ప్రాంతాల మధ్య ఆధ్యాత్మిక, పర్యాటకుల సంఖ్య గణణీయంగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రైలు ప్రతిరోజూ నడిచేలా రైల్వేశాఖ చొరవ చూపాలని కోరారు.