Oct 11,2023 22:00

ప్రదర్శనగా వెళ్తున్న విఒఎలు

* అడ్డుకున్న పోలీసులు
* 250 మంది అరెస్టు, విడుదల
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
మూడేళ్ల వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యులర్‌ 64ను వెంటనే రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వెలుగు విఒఎలు చేపట్టిన 36 గంటల ధర్నా రెండో రోజు బుధవారం కొనసాగింది. మొక్కవోని దీక్షతో రాత్రి, పగలు తేడా లేకుండా ధర్నా శిబిరం వద్ద విఒఎలు నిరసన తెలిపారు. జ్యోతిరావు పూలే పార్కు వద్ద చేపట్టిన ధర్నా శిబిరం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సిఐటియు నాయకులు, విఒఎలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విఒఎల సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.మహాలక్ష్మి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రభావతి, జి.అసిరినాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్‌.వి.రమణతో పాటు 250 మందిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేష్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం
     తొలుత ధర్నా శిబిరం వద్ద విఒఎలను ఉద్దేశించి సంఘ నాయకులు మాట్లాడుతూ విఒఎల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఒఎల మెడపై కత్తిలా మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్‌ను తీసుకొచ్చిందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విఒఎలను ఉద్యోగ భద్రత కల్పించి, సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్ని ఆటంకాలు కల్పించినా విఒఎలు వాటిని ఎదురొడ్డి ఆందోళన కొనసాగించారని కొనియాడారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విఒఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విఒఎల ఉపాధికి నష్టదాయకమైన గ్రామ సమాఖ్యల విలీనాన్ని ఆపాలన్నారు. సంఘాలను విడగొట్టడం కలపడం వంటి చర్యలు సెర్ఫ్‌ అధికారులు చేయడం సరికాదన్నారు. దీనివల్ల వేలాది మంది విఒఎలు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ఎక్కువ సంఘాలున్న విఒఎల నుంచి తక్కువ సంఘాలున్న విఒఎలకు సర్దుబాటు చేయాలని, రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. విఒఎల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో విఒఎల సంఘ నాయకులు జి.భవాని, డి.జోగారావు, కె.సీతమ్మ, ఎస్‌.లక్ష్మి, పి.రమాదేవి, జి.ఎర్రయ్య, సిహెచ్‌.స్వాతి, పి.లక్ష్మి, ఎన్‌.రాజేశ్వరి, యు.భవానీ తదితరులు పాల్గొన్నారు.