కలెక్టరేట్ వరకు ర్యాలీ, మండుటెండలో నిరసన
డిఆర్‌డిఎ పీడీ వినతిపత్రం అందజేత
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రారు
సమస్యల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు
విఒఎల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నిర్మలాదేవి
ప్రజాశక్తి - భీమవరం
రాత్రీ.. పగలు, ఎండ.. మంచు, పురుగూ.. పుట్ర ఇవేమీ లెక్క చేయకుండా తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు విరమించుకోవాలని యానిమేటర్లు, ఆర్‌పిలు కదంతొక్కారు. మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్, గ్రేడింగ్ పద్ధతి రద్దు చేయాలని, రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని, రూ.10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతోపాటు తదితర డిమాండ్లపై ఎపి వెలుగు విఒఎల (యానిమేటర్లు) సంఘం, ఎపి మెప్మా (ఆర్‌పి) ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో విఒఎలు, ఆర్‌పిలు భీమవరం కలెక్టరేట్ వద్ద చేపట్టిన 36 గంటల ధర్నా విజయవంతమైంది. స్థానిక తిరుమల విద్యాసంస్థలు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మంగళవారం చేపట్టిన ధర్నాకు విఒఎలు, ఆర్‌పిలు వందలాదిగా తరలొచ్చారు. అక్కడే బైఠాయించి, నిరసన తెలిపి, వంటావార్పు చేసి రాత్రి అక్కడే బస చేశారు. నిద్రించేందుకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ అవేమీ లెక్క చేయకుండా తమ సమస్యలే ప్రధాన ఎజెండాగా నిలబడ్డారు. బుధవారం ఉదయానే ధర్నా చేపట్టి నిరసన కొనసాగించారు. అక్కడ నుంచి విఒఎల సంఘం నేతలు, మెప్మా ఉద్యోగ సంఘం నేతలు, సిఐటియు నేతలు, ఆర్‌పిలు, విఒఎలు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరారు. ఈ నేపథ్యంలో అప్పటికే ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలు జిల్లా అధికారులకు చెప్పుకునేందుకు కలెక్టరేట్ వరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కొంతమంది మాత్రమే వెళ్లండని భీమవరం టౌన్ సిఐ అడబాల శ్రీనివాస్ చెప్పారు. దీనికి అంగీకరించని వారు తామంతా శాంతియుతంగా వెళ్లి వినతిపత్రం అధికారులకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. దీనిపై సిఐ శ్రీనివాస్‌తో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, జిల్లా నాయకులు బి.వాసుదేవరావు మాట్లాడారు. అక్కడి నుంచి ర్యాలీ కొంతదూరం వెళ్లాక మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. మళ్లీ నేతలు పోలీసులకు నచ్చజెప్పి కలెక్టరేట్ ప్రాంగణం వరకు పోలీసు పహారా మధ్య ర్యాలీ సాగించారు. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూనే ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నినాదాలు చేశారు. మండుటెండలో బైఠాయించి చీరకొంగులు తలపై వేసుకుని చెమటలు కక్కుతూ కలెక్టర్, జిల్లా అధికారులు బయటకు రావాలని చేసిన నినాదాలతో కలెక్టరేట్ హోరెత్తింది. డిఆర్‌డిఎ పీడీ వేణుగోపాల్ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్మోహన్‌రారు, వెలుగు విఒఎల సంఘం జిల్లా అధ్యక్షులు నిర్మలాదేవి వేణుగోపాల్‌కు సమస్యలు వివరించారు. అనంతరం విఒఎలు, ఆర్‌పిల సంఘాల నేతలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పీడీ వేణుగోపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ విఒఎలను, ఆర్‌పిలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించమని సీసీలు, ఎపిఎంలకు చెప్పామన్నారు. జీతాలు అందని విషయం తన దృష్టిలో ఉందని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని తెలిపారు. మండల, గ్రామ సమాఖ్యలతో మాట్లాడి గుర్తింపు కార్డులు, యూనిఫారం ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో జాయింట్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా నాయకురాలు డి.కళ్యాణి, సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, విఒఎల సంఘం నాయకులు గోవిందమ్మ, ఝాన్సీ, తోట పద్మావతి, సోనీ, ధనలక్ష్మి, వాకలపూడి రత్నం, పద్మకుమారి పాల్గొన్నారు.
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు
ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా ఒరిగిందేమీ ఉండదని, వారి సొంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు తప్ప సమస్యలు పట్టవని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు అన్నారు. రెండు రోజులపాటు విఒఎలు చేపట్టిన ధర్నానుద్దేశించి రారు మాట్లాడారు. విఒఎలు, ఆర్‌ఫిలు రకరకాల పని ఒత్తిళ్లతో అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. జాబ్‌చార్ట్ ప్రకారం కాకుండా అన్ని రకాల పనులు చెప్పి ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. వీరి సమస్యల పట్ల ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారని, అయితే అమలు జరగలేదని అన్నారు. అయితే మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఈ బిల్లు 2029 వరకు అమల్లోకి రాదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 1926లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏడుగురు సభ్యులుంటే సంఘం పెట్టుకోవచ్చని చట్టం చేసిందన్నారు. అయితే బిజెపి ప్రభుత్వం మాత్రం నూటికి పదిమంది ఉంటేనే సంఘం పెట్టుకోవాలని సంఘాలను విచ్ఛిన్నం చేస్తుందని మండిపడ్డారు. మహిళలంతా రాత్రీ పగలు ఇక్కడ కూర్చుని ఆందోళన చేస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధిగానీ, జిల్లా అధికారులుగానీ స్పందించకపోవడం అత్యంత దారుణమన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు.
సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు
విఒఎల సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి
ఆర్‌పిలు, విఒఎలు ఎన్నోఏళ్ల నుంచి అనేక సమస్యల మధ్య సతమతమవుతున్నా, ఆ సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విఒఎల సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి విమర్శించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పిన జగన్ మోసం చేశారని విమర్శించారు. ముడేళ్ల కాళ్లపరిమితి సర్క్యులర్ తీసుకురావడం దుర్మార్గమన్నారు. కనీస ఉద్యోగ భద్రత లేదని, రూ. 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రకరకాల పనులతో పని ఒత్తిడికి గురిచేసి అనారోగ్య సమస్యలకు ప్రభుత్వమే కారణమవుతుందని మండిపడ్డారు. గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు దఫదఫాలుగా ఆందోళన సాగిస్తామని హెచ్చరించారు.
ప్రజాసంఘాల సంఘీభావం
విఒఎలు, ఆర్‌పిలు చేపట్టిన 36 గంటల ధర్నాకు సిపిఎంతోపాటు పలు ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎస్.లారెన్స్‌కుమారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎమ్‌డి.హసీనా, విఆర్‌ఎ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.ఆంజనేయులు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు బి.విజయకుమార్, పట్టణ పేదల సంక్షేమ సంఘం నాయకులు ఎం.వైకుంఠరావు ధర్నా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని తరలించే విఒఎల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. విఒఎలతోపాటు అన్ని రంగాల స్కీమ్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.










