జిల్లా కలెక్టర్ హరినారాయణన్
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్ : స్పందన వినతుల పరిష్కారంలో బాధ్యత కలిగి చిత్త శుద్దితో పరిష్కారం జరగాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై స్పందన వినతుల పరిష్కారంపై చిత్తూరు డివిజన్‌లోని మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రాజాబాబు, జాయింట్ కలెక్టర్ (అభివద్ది) సి.హెచ్ శ్రీధర్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశ నిర్దేశం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సంబంధిత సమస్యలను సరైన కారణం లేకుండా తిరస్కరించరాదని అన్నారు. అర్జీదారులు కోరిన దవ పత్రాలు, పరిష్కారాలు అర్ధవంతంగా ఉండాలని సూచించారు. వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు , భూ రక్ష పధకంతో రైతుల భూములు రికార్డులు శాశ్వతంగా రికార్డు కానున్నదని, రీ సర్వే పకడ్బందీగా జరగాలని, డిసెంబర్ 2023 నాటికి మూడు విడతల్లో జిల్లాలో రీ సర్వే పూర్తి కావాలని, అందుకు సంబంధించిన రికార్డులు సిద్దం చేసుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2019 నుండి ప్రారంభించిన విషయం తెలిసిందేనని, అర్జీదారులకు సమస్యలను సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మేరకు పరిష్కరించాలని తెలిపారు. స్పందనకు సంబంధించి ఈ జనవరి 1 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు డేటా తీసుకుంటే రెవెన్యూకు సంబంధించిన అంశాలు 93 వినతులు రీ ఓపన్ అయ్యాయన్నారు. దీనికి కారణం అధికారులు అర్జీదారులకు సరైన సమాధానం ఇవ్వకపోవడమేనని తెలిపారు. ఇందులో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఆధారంగా మీరు చేసిన తప్పుల వల్ల ఆటో మేటిక్‌గా స్పందన వినతులు ఆటో మేటిక్‌గా రీ ఓపన్ జరుగుతాయని, అర్జీదారులతో మాట్లాడాలని కూడా స్పందనలో ఒక విధానం అని తెలిపారు. స్పందనలో అందే ప్రతి అర్జీని పూర్తిగా చదవాలని, ఎంపిడిఓలు ప్రత్యేకంగా రోజు వారి అర్జీల పరిశీలనకు సహాయ కులుగా ఎఓని నియమించు కోవాలని ఇప్పటికే తహశీల్దార్లు డిటిలను నియ మించుకొని పరిష్కరిస్తున్నారని సూచించారు. స్పందన అర్జీల రీ ఓపన్ లో ప్రధానంగా బ్లాంక్ డాక్యుమెంట్‌లు అప్లోడ్ చేయడం, అర్జీ దారులు అడిగిన దానికి వేరొక సమాధానం ఇవ్వడం వంటివి చోటు చేసుకున్నాయని మరో మారు ఇలాంటివి తలెత్తకుండా బాధ్యతతో సకాలంలో అర్ధవంతమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో చిత్తూరు ఆర్.డి.ఓ రేణుక, చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడిఓలు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.










