Sep 19,2023 21:06

వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు
కమిషనర్‌ అరుణ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

వినాయక నిమజ్జనానికి సంబంధించి కట్టమంచి చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టినట్లు నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. సోమవారం సాయంత్రం కమిషనర్‌ కట్టమంచి చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మూడు రోజులు పాటు వినాయక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన పనులపై అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఏర్పాట్లపై గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతోనూ చర్చించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వీలుగా కట్టమంచి చెరువులో నీటి మట్టాన్ని పెంచడం జరిగిందని, సులభంగా నిమజ్జనం చేయడానికి వీలుగా అదనపు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మెరుగైన లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని, పారిశుధ్య నిర్వహణ కోసం మూడు షిఫ్ట్‌లలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌, మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చెరువు వద్ద ఇద్దరు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. వీటితోపాటు స్వయం సహాయక సంఘాల వారిచే చిరుధాన్యాలు, డ్వాక్రా ఉత్పత్తులతో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను నిమజ్జనం చేయడం, టపాకాయలను తక్కువ స్థాయిలో వినియోగించడం ద్వారా నీటి, గాలి కాలుష్యాలను తగ్గించడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. నిమజ్జన సమయంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, డీఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, వార్డు కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.