
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఈనెల 18న వినాయక చవితి సందర్భంగా వినాయకుని మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు సంబంధిత డిఎస్‌పి అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వినాయక చవితి ఉత్సవాలను సక్రమంగా నిర్వహించేందుకు నిర్వాహకులు కింది నియమాలను పాటించాలని సూచించారు.
మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత డిఎస్‌పి (సబ్ డివిజనల్ ఆఫీసర్) కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలి.
డిఎస్‌పి కార్యాలయంలో అనుమతులకు దరఖాస్తు పెట్టే ముందు దరఖాస్తుతో పాటుగా మున్సిపాల్టీ, పంచాయతీ, అగ్నిమాపక, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల అనుమతులు తప్పనిసరిగా జత చేయాలి.
బలవంతపు చందాలు, వసూళ్లు గానీ దర్శనాల టిక్కెట్లు గానీ పెట్టరాదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే వాటిపై ఫిర్యాదులు చేసేందుకు డయల్ 100కి ఫోన్ గానీ 6309990933 నంబరుకు పోలీసు వాట్సాప్ నంబరుకు సమాచారాన్ని అందించాలి.
ప్రతి మండపానికి సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి ఒక పోలీస్‌ను కో-ఆర్డినేటర్‌గా నియమించడం జరుగుతుంది.
విగ్రహం ఎత్తు, బరువు, ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జనం చేసే ప్రాంతం, వెళ్లే తోవను పోలీసులకు ముందుగా తెలపాలి.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా నిర్వాహకులు ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.
శబ్ద కాలుష్యం నియంత్రిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమాలైన పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రిపూట 45 డెసిబుల్స్ దాటకుండా, బాక్స్ టైపు స్పీకర్లను మాత్రమే వినియోగించాలి.
ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద తప్పనిసరిగా కాపలాగా ఉండాలి. నిర్వాహకులు సిసి టివిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
మండపాల వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి. విగ్రహాల దగ్గర వాహనాలు నిలపరాదు.
ఊరేగింపు సమయములో అశ్లీల పాటలు, డాన్సులు చేసినా, మందుగుండు సామాన్లు, టపాసులు వాడినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.
నిమజ్జనం నిర్దేశించిన సమయంలో ఊరేగింపు ప్రారంభించి, నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిమజ్జనం చేయాలి. అనుమతి పొందిన ప్రదేశాల్లో తప్ప వేరే ఇతర ప్రదేశాల్లో నిమజ్జనం చేయరాదు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకల నిర్వహణకు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలి.
అనుమతులు ఉన్న స్థలంలో మండపాలు ఏర్పాటు చేసి ఆయా స్థలంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి.