ప్రజాశక్తి పుట్లూరు మండల పరిధిలోని వెలుట్ల గ్రామంలో పది రోజుల నుంచి వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటి వరకూ సుమారు 40 ఆవులు చనిపోయినట్లు పాడి రైతులు వాపోతున్నారు. వీటిలో వెంకటరాముడి చెందిన ఆవులు 5, రామయ్యవి 2, శ్రీరాములు, వోలుపతి, రామయ్య, తదితరుల ఆవులు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇన్ని పశువులు చనిపోతున్నా పశు వైద్యసిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెల్లుట్ల గ్రామంలో సుమారు వెయ్యి ఆవులు ఉన్నాయి. రెండు రోజుల క్రితం వెంకటరామునికి చెందిన అవును పశువైద్య సిబ్బంది 1962 అంబులెన్స్ వాహనంలో తాడిపత్రి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే మరుసటి రోజే ఆవు మృతి చెందింది. మంగళవారం కూడా గోపాల్‌కు చెందిన ఆవును అంబులెన్స్‌లో వైద్యపరీక్షలకు తీసుకెళ్లారు. పరీక్షలకు తీసుకెళ్లడం తప్ప ఆవులు ఎందుకు చనిపోతున్నాయి.. ఏ వ్యాధి సోకింది అనే విషయాలను తమకు చెప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా పశువైద్యాధికారి గ్రామానికి రాకపోవడం బాధాకరమని అంటున్నారు. ఇదే విషయమై కొందరు రైతులు గ్రామానికి ఇన్‌ఛార్జి పశు వైద్యాధికారిణిగా ఉన్న నాగసువర్ణను అడగ్గా తాను ఇన్‌ఛార్జి డాక్టర్‌ను మాత్రమే అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఇన్‌ఛార్జి డాక్టర్ అయినా పదుల సంఖ్యలో పశువులు చనిపోతున్నా ఎందుకు రాలేకపోతున్నారని వాపోతున్నారు. చేసేది లేక కొంతమంది రైతులు ప్రయివేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా వేలకు వేలు డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ విషయంపై పశువైద్యాధికారి నాగ సువర్ణను వివరణ కోరగా తనకు ఆవులు చనిపోయిన విషయం తెలియదని చెప్పారు. 40 పశువులు చనిపోయాయని గ్రామస్తులు చెబుతున్నట్లు చెప్పగా అబద్ధమని కొట్టిపారేశారు. తాను ఇక్కడ ఇన్‌ఛార్జి డాక్టర్‌గా మాత్రమే పని చేస్తున్నానని ఇవన్నీ తెలియని చెప్పారు. అంతేగాకుండా రోగాలు వచ్చినప్పుడు పశువులను జాగ్రత్తగా చూసుకోవాలేగానీ, కొండల్లోకి మందల మందలు వెళితే రోగాలు రాకుండా ఉంటాయా.. అని ఎద్దేవా చేయడం కొసమెరుపు..
వింత వ్యాధితో మృతిచెందిన ఆవులు










