పిల్లలను పంపేందుకు విముఖత చూపుతూ..
తల్లిదండ్రుల ఆగ్రహం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
వీరంతా చిత్తూరు నగరం గుండ్ల కట్టమంచిలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ గ్రామంలో ఉన్న బడి దాదాపు 75ఏళ్లకు పైగానే నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలల విలీనంలో భాగంగా ఈ పాఠశాలను కిలోమీటరు పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌లోకి మార్చారు. ఇన్నేళ్లు నడుస్తున్న బడిని మూసేయడంపై ఈ ఊరి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్ హైవేపక్కన ఉందని, చిన్న పిల్లలను అక్కడకు పంపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా బడిని మా ఊళ్లోనే ఉండాలని డిమాండు చేస్తున్నారు.
ఇది ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు. జిల్లాలో ఇలాంటి ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడంపై ఆందోళనలు తీవ్ర తరమవుతున్నాయి. నేటి నుంచి పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో అడ్మిషన్లకోసం బడులకు వెళుతున్న సందర్భంగా బడిమూసేస్తారని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యావిధానం పేరుతో ఉన్న పాఠశాలను కూడా మూసేయడం ఏమిటని విద్యార్థుల తలిదండ్రులు, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నూతన విద్యావిధానంలో భాగంగా 3,4,5 తరగతులను కిలోమీటర్ పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలోకి విలీనం చేయాలని నిర్ణయించిన విషయం విధితమే. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 31 మండలాల్లో 467 పాఠశాలలను విలీనం చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ప్రాథమిక 383, ప్రాథమికోన్నత 84 పాఠశాలలున్నాయి. వీటిల్లో నుంచి తరగతుల వారీగా మొత్తం 1,77,482 విద్యార్థులను విలీనం చేయాలని నిర్ణయించారు.
మూడు కిలోమీటర్ల పైన ఉన్నా కలిపేశారు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలోని నరసింహాపురం గ్రామ పంచాయతీలోని టివిఎన్‌ఆర్ పురం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇది 17ఏళ్లుగా నడుస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉంది. నూతన విద్యావిధానంలో భాగంగా ఈ పాఠశాలలోని 6,7,8 తరగతికి చెందిన విద్యార్థులను తిరుమల రాజపురంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కలుపుతున్నారు. ఇది 4.5 కిలోమీటర్ల పైనే ఉంది. ఇంత దూరం వెళ్లి రోజూ ఎలా ఇంటికి వచ్చేదని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కూలీ నాలీ చేసుకునే పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఉన్నారు. ఇంత దూరం పాఠశాలను మార్చితే పిల్లలు ఎలా పంపుతామని వారు వాపోతున్నారు.
పసి పిల్లలను ఎలా హైవే దాటించేది : ఊహ, పిల్లల తల్లి
నాకు ముగ్గురు పిల్లలున్నారు. మా గ్రామంలో ఇంటి పక్కనే ప్రాథమిక పాఠశాలలో రెండు, నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నారు. దీన్ని హైవేకి దగ్గర ఉన్న జెడ్‌పి హైస్కూలుకు మార్చారు. చిన్న పిల్లలు రోడ్డుపైన రోజు ఎలా బడికి వచ్చి పోతారు. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. మా బడిని ఎక్కడికి మార్చొద్దండి










