'విలీనం వద్దు.. మా పాఠశాలే ముద్దు..'
ప్రజాశక్తి- కార్వేటినగరం: ప్రాథమిక పాఠశాల 'విలీనం వద్దు మా పాఠశాలే ముద్దు' అని ఇందిరాకాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం పాఠశాల విలీనంపై నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇందిరాకాలనీలోని ప్రాథమిక పాఠశాల నుంచి ఆర్కేవీబీపేట ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వలన సుమారు కిలోమీటరు దూరంలో పిల్లలు నడిచివెళ్లి రావడం కష్టతరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామానికి మధ్యలో ప్రమాదకరమైన వాగు ఉందని, వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను విలీనం చేసినట్లయితే పిల్లలకు టీసీలు ఇప్పించాలని కోరారు.
బడులు ప్రారంభించి ఎనిమిది రోజులైనా తెరచుకోని పాఠశాల
గంగవరం: మండలంలోని కీళ్లపట్ల పంచాయతీ జరవారిపల్లి పాఠశాల నూతన విద్యావిధానాన్ని, విలీనాన్ని ఖండిస్తూ తమ పిల్లలను వేరే ఊరికి పంపమని పాఠశాలలు ప్రారంభించిన రోజునే పాఠశాల గేటుకు తాళాలు వేసి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే. బడులు ప్రారంభించి ఎనిమిది రోజులు కావస్తున్న గేటు తీయనీకుండా పాఠశాలకు పిల్లలను పంపకపోవడంతో ఉపాధ్యాయులు పేరుకు మాత్రం వచ్చి హాజరు వేసి ఎవరిదారిన వారు వెళ్ళిపోతున్నారు. అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు మౌనం వహిస్తున్నారు. ఇక అంగన్వాడి కేంద్రంను పాఠశాల ఆవరణలో ఉంచడంతో వారిని సైతం గ్రామస్తులు లోనికి పోనివ్వకుండా అడ్డుకోవడంతో ఆరుబయటే కూర్చొని చదువుకొని వెళ్లిపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల తెరిచేది లేదంటూ గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాల ఎప్పుడు తెరుస్తారో, ఏ స్కూల్‌కు వెళ్లాలో తెలీక కొందరు తల్లిదండ్రుల వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.










