Jul 07,2022 22:33

విలీన రగడ
తగ్గేదేలే అంటున్న ప్రభుత్వం
తల్లిదండ్రుల్లో తీవ్ర నిరాశ
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
సౌకర్యాలు లేకనే బడికి
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి, యంత్రాంగం

రాష్ట్ర ప్రభుత్వం రాజేసిన విలీన రగడ ఆగడం లేదు. బడులు తెరిచినప్పటి నుంచి జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా మంకుపట్టు వీడడం లేదు. విలీనంపై ముందుకే వెళతాను అంటోంది. అయితే దూరప్రాంతాలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఎక్కడికక్కడ బడులకు తళాలేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే క్రమంలో పిల్లలకు ప్రమాదాలు జరుగుతాయోమోనని భయపడుతున్నారు. ఇదిలా ఉంటే విలీనానికి తగ్గట్టుగా ఆయా పాఠశాలల్లో తగినన్ని సౌకర్యాలు కూడా లేవని వారు చెబుతున్నారు. అసలు విలీనమే వద్దని తల్లిదండ్రులు గట్టిగా డిమాండు చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా ప్రాంతాల్లో బడులకు తాళాలేసి నిరసన తెలుపుతున్నారు.
నూతన విద్యావిధానంలో భాగంగా 3,4,5 తరగతులను కిలోమీటర్‌ పరిధిలో ఉన్న ఉన్నతపాఠశాలలోకి విలీనం చేయాలని నిర్ణయించిన విషయం విధితమే. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 31 మండలాల్లో 467 పాఠశాలలను విలీనం చేయాలని అధికారులు ప్రతిపాధించారు. ఇందులో ప్రాథమిక 383, ప్రాథమికోన్నత 84 పాఠశాలలున్నాయి. వీటిల్లో నుంచి తరగతుల వారీగా మొత్తం 1,77,482 విద్యార్థులను విలీనం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇలా విలీనం చేస్తున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా నిరసనలు మిన్నంటుతున్నాయి. బడులకు తాళాలేసి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాధానాలు చెప్పలేక విద్యాశాఖలోని ఎంఇఓలు, హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే చాలా విలీనం చేస్తున్న చాలా ప్రాంతాల్లో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా తరగతి గదులు చాలడం లేదు. ఇలాంటి దాదాపు 170కి పైగా స్కూళ్లు ఉంటాయని అనధికారక అంచనా. దీంతో విలీన విద్యార్థులు గదులు లేకనే చెట్ల కింద కూర్చోవాల్సిన దుస్థితి నెలకుంటోంది. అలాగే మరుగుదొడ్ల కొరత కూడా అధికంగా ఉంది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో వాటి సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. అలాగే విలీనం కావడంతో ఆయా ప్రాంతాల్లోని పిల్లలకు తగిన విధంగా వంట చేసేందుకు సౌకర్యాలు కూడా ఉండడం లేదు. ఇప్పటికే ఎక్కువ ప్రాంతాల్లో గదులు లేకుండా ఆరుబైట వడ్డిస్తున్నారు. వస్తున్న విద్యార్థులకు అదనంగా సరుకులు సమకూర్చుకోవాల్సి వస్తోంది. అప్పటికప్పుడు పెద్ద మొత్తం తెచుకోవడంలో వంటమ్మలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో బడులు దూరంగా ఉంటున్నాయి. పిల్లలను ప్రతిరోజూ తీసుకెళ్లి రావడానికి తల్లిదండ్రులుగా భారంగా మారుతోంది.
గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌పురం మండలంలోని డీకేమర్రిపల్లి గ్రామంలో పాఠశాలకు ప్రవేశం లేదంటూ ముళ్ళ కంపలు వేసి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల విలీనంపై గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల నుంచి తిరుపతి రోడ్డు వరకు ర్యాలీగా వచ్చి డీకేమర్రిపల్లి గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్‌ఆర్‌ పురం మండలం డీకేమర్రిపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి పక్క మండలమైన వెదురుకుప్పం మండలం దేవలంపేట ఉన్నత పాఠశాలలో మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చేరాలని ఆదేశాలు రావడంతో తమ పిల్లలను అంత దూరం పంపలేమంటూ రోడ్డుపై నిరసన తెలియజేస్తున్నారు.
వెదురుకుప్పం మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల బలిజ మొండివెంగనపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామప్రజలు పిఎంసి చైర్మన్‌ నీరుగట్టు సురేంద్ర, మాజీ పిఎంసి చైర్మన్‌ కొత్తపల్లి జాకబ్‌, సర్పంచ్‌ లలితాభాస్కర్‌ల ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని బడికి తాళాలు వేసి నిరసన తెలిపారు. తమ పాఠశాలలోని యూపీ సెక్షన్ల బోధన ఈ పాఠశాలలోనే ఉండాలని వారిని వెదురుకుప్పం ఉన్నత పాఠశాలలో కలపడం ఆపాలని ఆందోళన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుండి చిన్నపిల్లలు వెదురుకుప్పం ఉన్నత పాఠశాలకు వెళ్లలేరని ఆరు, ఏడు, ఎనిమిది తరగతులను ఇక్కడే కొనసాగించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. విలీనం చేస్తే తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపించక తప్పదని హెచ్చరించారు. అలాగే బ్రాహ్మణపల్లి, గొల్లపల్లి ఇంకా దూరం నుండి వెదురుకుప్పం హైస్కూల్‌కు విద్యార్థులు రావాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుందని రోజూ రానుపోను పిల్లలు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి అలిసిపోతారని వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు.
బైరెడ్డిపల్లి మండంలోని బేలుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బెల్లమడుగు గ్రామంలో ఎంపియుపిఎస్‌ పాఠశాలను బేలుపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో దీన్ని నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన తెలిపారు. విద్యార్థులు బెల్లంమడుగు గ్రామం నుంచి బేలుపల్లి జెడ్‌పి పాఠశాలకు రావాలంటే రానుపోను 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని రాకపోకలు కష్టమవుతుందని ఎంఆర్‌సి కార్యాయలం ఎదుట ధర్నా చేశారు. వెంటనే విలీనం ఆపాలని బెల్లంమడుగు గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. అలాగే మండల పరిధిలోని దేవదొడ్డి గ్రామంలోని ఎంపియుపి పాఠశాలను తీర్థం గ్రామపరిధిలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు విలీనం చేయవద్దు అంటూ బైరెడ్డిపల్లి టు కుప్పం జాతీయ రహదారిలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల చైర్మన్‌ కలసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎంపీపీ దేవదొడ్డికి వినతిపత్రం అందించారు.
బంగారుపాళ్యం మండలంలోని ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ఆపాలని గుండ్ల కట్టమంచి గ్రామానికి చెందిన పిల్లల తల్లిదండ్రులు గురువారం ఉన్నత పాఠశాల ఆవరణంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనంలో చేయడం వలన సమస్యలు అధికమవుతున్నాయని, ఉన్నత పాఠశాల పక్కనే జాతీయ రహదారి ఉన్నదని అభం శుభం తెలియని పిల్లలను పాఠశాలకు పంపడం వలన ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రాథమిక పాఠశాలను గ్రామనడిబొడ్డులోనే నడపాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.