Jun 16,2022 22:15

విలీన ప్రక్రియ ఆపండి
జీవో నంబర్‌ 117 రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించి, ఉన్నత పాఠశాలల్లో సెక్షన్‌ ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించడం ద్వారా విద్యార్థికి ఎలా నాణ్యమైనవిద్య అందుతుందో ప్రభుత్వం చెప్పాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఫ్యాప్టో నాయకులు ఎన్‌.వెంకటేశ్వర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు. 117జీవో విడుదల చేయడం ద్వారా విద్యార్థులకి ఉపాధ్యాయులకి సమాజానికి జరిగే మేలు కంటే ఎక్కువ నష్టం ఉంటుందన్నారు. దీని వలన ప్రభుత్వం బడ్జెట్లో విద్యుకు కేటాయింపులు తగ్గించుకోవడానికి మాత్రమే వీలు కలుగుతుందని తెలిపారు. ఉన్నతాధికారులు పదేపదే రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ ప్రకారం సంస్కరణలు చేస్తున్నామని చెప్తూ ఒక ఉపాధ్యాయుడిని 30 మంది విద్యార్థులకు కేటాయిస్తున్నారని అన్నారు. అయితే ఇదే 8వ తరగతి వరకు మాతభాషలోనే విద్య అనే అంశాన్ని ప్రస్తావించకుండా ఒక మీడియం మాత్రమే ఉంటుందని చెప్పడం ఎలా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసినట్లో అధికారులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జాతీయ విద్యా విధానం 2020లో గాని, ఆర్‌టిఐ యాక్ట్‌లో గాని ప్రాథమిక పాఠశాలను విభజన చేయాలని లేకపోయినా ఒక కిలోమీటరు లోపు ప్రాథమిక పాఠశాల ఎవరి ప్రయోజనం కోసం, ఎవరి ఆదేశం మేరకు విభజన చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 22వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సైతం ఈప్రభుత్వం న్యాయం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 117 జీవోను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయులు నిష్పత్తిని పెంచటం ద్వారా, ఉన్నత పాఠశాలలో అలాగే యూపీ పాఠశాలలో పోస్టులు పెట్టడం వల్ల మరో ఐదు సంవత్సరాల వరకు లేని విధానం ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించడమేనని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో, ఎమ్మెల్సీలతో మాట్లాడి విద్యార్థులకు న్యాయమైన, నాణ్యమైన విద్య అందించడానికి కావలసిన ప్రణాళికలు రూపొందించాలని, 117 జీవోని రద్దు చేయాలని, తెలుగు మీడియం కొనసాగించాలని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ఉంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యా వ్యవస్థను కొనసాగించండి లేకపోతే భవిష్యత్తులో ఫ్యాప్టోలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలసి డిఇఒ కార్యాలయాల ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ధర్నా అనంతరం డిఇఒ శ్రీరామ్‌ పురుషోత్తంకు జిల్లా ఫాప్టో ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్టీయు రాష్ట్ర సహాఅధ్యక్షులు గంటా మోహన్‌, నరోత్తం రెడ్డి, జిల్లా ఫ్యాప్టో నాయకులు జీవి రమణ, దేవరాజులు రెడ్డి, నాథముని, గోపీనాథ్‌, రమేష్‌, ముణాఫ్‌, హైదర్‌ బాషా, రవి, రఘుపతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సోమశేఖర్‌ నాయుడు, చెంగల్రాయ మందడి, మోహన్‌, మదన్‌మోహన్‌ రెడ్డి, ఎస్‌ఎం బాషా, రెడ్డెప్ప నాయుడు, కిరణ్‌, సెల్వ పాండియన్‌, రవీంద్రారెడ్డి, రమేష్‌, గణపతి, సరిత, యువరాణి, చిట్టిబాబు, గణేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.