Feb 18,2022 21:56

పరమేశ్వర మంగళంలో ఉపాధ్యాయులతో ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌, నగరి
పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం వల్ల ఎంతమంది విద్యార్థులు కొత్తగా వస్తున్నారు? అని ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం ఆరా తీశారు. పుత్తూరు మండలంలో ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించారు. భోజన విరామ సమయంలో పరమేశ్వర మంగళం ఉన్నత పాఠశాలను సందర్శించారు. విలీనం వల్ల ఎంతమంది విద్యార్థులు కొత్తగా వస్తున్నారు? దీనివల్ల ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. తమకు ఓ పక్క ప్రహరీగోడ నిర్మించాల్సి ఉందని ఉపాధ్యాయులు కోరగా కలెక్టర్‌తో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ అందరూ పట్టుదలతో కృషి చేసి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎస్‌ఎస్‌ నాయుడు, ఉపాధ్యాయులు సురేష్‌ పాల్గొన్నారు. అనంతరం నగరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించారు. నూతన విద్యా విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 1, 2 తరగతులను 3, 4, 5 తరగతులను విడగొట్టి హైస్కూల్లో విలీనం చేయడమనేది చాలా దారుణమైన చర్యని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల పిల్లలు చదువుకు దూరమవుతారన్నారు. నూతన విద్యా విధానం ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదని, కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం లేదన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అమలవుతోందని, ఇది ముమ్మాటికీ పాఠశాలలను కుదించే ప్రక్రియలో భాగమేనని విమర్శించారు. రాబోయే మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. విలీనంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.