Oct 24,2023 21:47

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌ బాలికా వికాసం కోసం పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థునులకు ఆరోగ్యం స్త్రీ, పురుషుల సమానత్వం, గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌, పరిసరాల పరిశుభ్రత, గృహహింస, పిల్లలపై వివక్షత అనే విషయాలపై పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నికల్‌, ఐటిఐలో చదువుతున్న విద్యార్థునులకు అవగాహన కల్పించేలా వైఎస్‌ఆర్‌ కిశోర వికాసం పేరుతో జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.తొలుత 2017-18లో జిల్లా కేంద్రమైన చిత్తూరులోని కాణిపాకం రోడ్డు సంతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతలో పాఠశాల విద్యార్థునులకు పరిమితం చేశారు. రెండో విడతతో కళాశాలలు, పాలిటెక్నిక్‌, ఐటిఐ విద్యార్థునులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 80వేల మంది విద్యార్థునులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థునులకు అవగాహన కల్పించేందుకు పీజి, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఎంపిక చేసిన చురుకైన విద్యార్థునులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ బాలికా వికాసం కార్యక్రమం నిధులు లేక నీరశించి పోయింది. కరోనా కారణంగా ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నా... ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా జిల్లాలో ఎక్కడా వైఎస్‌ఆర్‌ కిశోర బాలికా వికాసం పేరుతో కౌమార బాలికలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరగకపోవడం గమనార్హం. కౌమారదశలో ఉన్న పాఠశాల, కళాశాల విద్యార్థునుల్లో సమాజంపట్ల అవగాహన, విషయ పరిజ్ఞానం, ఇతరులపై ఆధార పడకుండా స్వయం ఉపాధి, మహిళాచట్టాలపై అవగాహన వంటి విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచుకొనేందుకు దోహదపడుతుంది. ఇతరులతో మాట్లాడేందుకు సహజంగా ఉండే బెరుకు, భయం పోయి స్వేచ్ఛగా మాట్లాడే తత్వం పెంపొందుతుంది. తిరిగి పారంభిస్తాం : నాగశైలజ, ఇన్‌ఛార్జి పీడీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థునుల్లో సమాజం పట్ల అవగాహన కల్పిండంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే వైఎస్‌ఆర్‌ కిషోర బాలిక వికాసం మూడో దశ 2019-20 నుండీ నిధుల లేక అగిపోయింది. కరోనా ప్రభావం ఒక కారణమైతే ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం మరో కారణం. ప్రభుత్వం నిధులు మంజురు చేసి కొనసాగించమంటే తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాం.