Apr 28,2023 08:16

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

           అనంతపురం కలెక్టరేట్‌: వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వైకల్యంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 ప్రకారం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్యాంగులకు సైతం మిగిలిన వారిలాగే అవకాశాలు కల్పించడమే కమిటి లక్ష్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వికలాంగుల హక్కుల నిబంధనలు, 2023పై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. వీలైనంత త్వరగా కమిటీలో నామినేటెడ్‌ సభ్యులను ఎంపిక చేయాలని విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ ఏడీ రసూల్‌ను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ విభిన్న ప్రతిభావంతుల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉండేలా ర్యాంపులు ఏర్పాటు చేయించాలని పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈని ఆదేశించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఒక గెజిటెడ్‌ అధికారిని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నియమించాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల ఖాళీలను నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా వికలాంగుల కోసం ప్రత్యేక నైపుణ్యాభివద్ధి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, ఎల్డీఎం నాగరాజ రెడ్డి, జెడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, డీపీఓ ప్రభాకర్‌ రావు, మెప్మా పీడీ విజయలక్ష్మి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ఓబుల్‌ రెడ్డి పాల్గొన్నారు.