Oct 05,2023 21:45

మాట్లాడుతున్న ధర్మాన కృష్ణదాస్‌

* ఆంధ్రాకు జగన్‌ ఎందుకు కావాలో చెప్పాలి
* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌
ప్రజాశక్తి - నరసన్నపేట: 
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలపై ప్రజలకు అవహగాన కల్పించేందుకు ఇంటింటి ప్రచారం చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాను స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను సాధించిన విజయాలతోనే గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్రాకు జగన్‌ ఎందుకు కావాలి అనే అంశంపై పార్టీ మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కన్వీనర్లు, గృహ సారథులతో స్థానిక కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఏ ఇంటినీ విడిచిపెట్టకుండా ప్రచారం నిర్వహించాలని సూచించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒక దఫా ప్రజలను నేరుగా కలిశామని, అప్పుడు వారికి ప్రభుత్వం తరుపున అందిన లబ్ధి గురించి చెప్పామన్నారు. ప్రజా సమస్యలను సైతం పరిష్కరించి వారికి దగ్గరయ్యామని తెలిపారు. ఈసారి ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాలు, అసత్యాలు, ఒంటరిగా పోటీ చేయలేక సాగిస్తున్న కుయుక్తుల గురించి వారికి విడమరచి చెప్పాల్సి ఉందన్నారు. రానున్న నాలుగు నెలల సమయం కీలకమని చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి మళ్లీ మళ్లీ తెలియజేసే కార్యక్రమమే ఆంధ్రాకు జగన్‌ ఎందుకు కావాలో తెలిపే కార్యక్రమమన్నారు. చంద్రబాబు పాలన, జగన్మోహన్‌ రెడ్డి పాలన రెండింటికీ ఉన్న తేడాపై ప్రజల్లో ఆలోచనలు ప్రేరేపించేలా ప్రతి గడపకు మరోసారి తీసుకెళ్లాలన్నారు.
బిసి సెల్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచిపై దుష్ప్రచారం చేసే వాటిని గుర్తించి, సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని తిప్పికొట్టాలన్నారు. నరసన్నపేట నియోజకవర్గం గత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిందని, ఈసారి రెట్టింపు మెజార్టీ సాధించేలా తామంతా పనిచేస్తామని చెప్పారు. సమావేశంలో డిసిసిబి చైర్మన్‌ కె.రాజేశ్వరరావు, ఎంపిపి ఆరంగి మురళీధర్‌, పార్టీ నాయకులు చింతు రామారావు, బార్ల వేణుగోపాల్‌, కోరాడ చంద్రభూషణ్‌ గుప్త, రాజాపు అప్పన్న, లుకలాపు రవికుమార్‌, సదాశివుని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.