
ప్రజాశక్తి - కొత్తూరు : కొత్తూరు మండలంలో డయేరియా విజృంభిస్తోంది. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఆసుపత్రి సుమారు లక్ష జనాభాకు వైద్య సేవలందిస్తోంది. కొత్తూరు మండలంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం, సీతంపేట, ఒడిశా రాష్ట్రం హడ్డుబంగి, కాశీనగర్ నుంచి రోగులు ఈ ఆస్పత్రికే వస్తుంటారు. అందుబాటులో వైద్యులున్నా ఎక్స్‌రే, స్కానింగ్ యంత్రాలతో పాటు ఇతర పరికరాలు లేకపోవడంతో రోగులను జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి రిఫర్ చేయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో 30 బెడ్లు ఉండడంతో ఇన్ పేషెంట్లకు సరిపోవడం లేదు. ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు రోగులు వైద్యం పొందే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్తగా నిర్మాణంలో ఉన్న అదనపు భవనాలు అందుబాటులోకి వచ్చే వరకు ఇబ్బందులు తప్పవని వైద్యాధికారులు చెప్తున్నారు. మండలంలోని మాకవరం నుంచి ఇద్దరు, నేతాజీనగర్ నుంచి ముగ్గురు, కుంటిభద్ర నుంచి ఇద్దరు, పార్వతీపురం జిల్లా భామిని మండలం యతాంగూడెం నుంచి ముగ్గురు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరి పరిస్థితి బాగానే ఉందని ప్రధాన వైద్యాధికారి జి.వేణుగోపాలరావు తెలిపారు. వేడినీళ్లు తాగడం, చేతులు పరిశుభ్రం చేసుకోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం చేసుకోవాలని సూచించారు. పారిశుధ్య పనులు పంచాయతీలు చేపట్టాలన్నారు.