
* లక్ష్యం ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోగలం
* అస్సాం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోత రవి
ప్రజాశక్తి - నౌపడ : విజ్ఞానంతోనే విశ్వ విజేతలం కాగలమని, ప్రతి విద్యార్థీ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటే అనుకున్న లక్ష్యానికి చేరుకోగలమని అస్సాం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి కోత రవి అన్నారు. సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోత అప్పన్న, మహాలక్ష్మి మెమోరియల్ వలంటీర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోత అప్పోజీ, సన్యాసమ్మ, లమ్మత చిన్నయ్య, నారాయణమ్మ మెమోరియల్ ప్రతిభా పురస్కారాలను విద్యార్థులకు అందించే కార్యక్రమంలో గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అందింతే ఈ స్కాలర్ షిప్పులు ఈ ఏడాది ఆరుగురికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1981లో పదో తరగతి ఇదే పాఠశాలలో చదివానని, ఒక లక్ష్యంతో చదివితే తప్పక మంచి ఫలితాలు సాధిస్తారని విద్యార్థులకు సూచించారు. నేటి సమాజంలో అవకాశాలతో పాటు సవాళ్లుకూడా ఉన్నాయని, వాటిని ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు అంతా నేటి యువతపై ఆధారపడి ఉందని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. పాఠశాలలో 2022-23 సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. నగదు పురస్కారాలు అందుకున్న ఆరుగురిలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానూని సాధన ప్రియ, కింజరాపు కావ్యశ్రీ, కొన్న చాందినిలకు వరుసగా ఐదు వేలు, మూడు, రెండు వేలు నగదుతోపాటు జ్ఞాపికలను అందించారు. లమ్మత చిన్నయ్య, నారాయణమ్మల నగదు పురస్కారాన్ని కింజరాపు దివ్య, చైతన్య నాయకో, కర్రి మనీషలకు చెరి రెండు వేల రూపాయల చొప్పున అందించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆయన్ని దుశ్శ్సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ నాగార్జున, స్థానిక ప్రజా ప్రతినిధులు మార్పు అశోక్, చక్రవర్తి, అప్పలస్వామి, అప్పలరాజు, వసంతరావు, సతీష్‌లతోపాటు సంస్థ సభ్యులు కోత మధుసూదనరావు, కోత ధర్మారావు, కోత మురళి, గ్రామ పెద్దలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోత చైతన్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.