ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
గ్రంథాలయాల నిర్వహణ ద్వారా సేవా, విజ్ఞానాన్ని అందించడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం బస్టాండ్ పక్కనున్న మీరా స్మారక గ్రంథాలయంలో నిర్మించిన సేవా విజ్ఞాన కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీ, యువకులు, విద్యావంతులకు ఈ గ్రంథాలయం ద్వారా అందించే సేవ ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఈ గ్రంథాలయం, సేవా విజ్ఞాన కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు, విజ్ఞాన కేంద్రాల నిర్వహణ వల్ల విద్య, సాంస్కృతిక సముపార్జనకు ఉపయోగపడతాయన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విజ్ఞాన కేంద్రాలు ప్రజలకు అనేక విధాలుగా సేవలందిస్తూ తోడ్పాటునందిస్తునాయన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహ్మద్ మీరా పేరు మీద గ్రంథాలయం ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ బర్రె వెంకటరమణ, మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు, వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు, ఉద్దరాజు రామం ట్రస్ట్ చైర్మన్ మంతెన సీతారాం, అల్లూరి సీతారామ రాజు భగత్ సింగ్ సేవా కేంద్రం ఛైర్మన్ బి.బలరాం, నరసాపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నల్లిమిల్లి జోసఫ్, జకెట్, అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రం నిర్వాహకులు బాపూశ్రీ మాట్లాడారు. సభకు మీరా గ్రంథాలయ, సేవా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు కవురు పెద్దిరాజు అధ్యక్షత వహించగా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు వందన సమర్పణ చేశారు.










