ప్రజాశక్తి - వీరవాసరం
వీరవాసరం పంచాయతీ పరిధిలో తూర్పుచెరువు వద్ద ఫిల్టర్‌బెడ్‌లను ఆనుకుని ఆక్రమిత స్థలంలో తాత్కాలిక షెడ్‌లను శనివారం పంచాయతీ కార్యదర్శి జెడివి.ప్రసాద్, ఇఒపిఆర్‌డి షరీఫ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రమేష్ పర్యవేక్షణలో తొలగించారు. ఆక్రమణల తొలగింపు పట్ల అధికారుల తీరుపై ఆక్రమణదారులు, ఇద్దరు పంచాయతీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో రెండు రోజులు గడవు ఇవ్వాలని కోరారు. ఇందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్ని ఆక్రమణలు తొలగించాలని పంచాయతీ తీర్మానించినా ముందుకు రాని అధికారులు ఎటువంటి అభ్యంతరాలు లేని ఇక్కడి ఆక్రమణలు ఎలా తొలగిస్తున్నారంటూ వారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఇదే ప్రాంతంలో చెరువు పోరంబోకుకు చెందిన సుమారు ఎకరం ప్రభుత్వ స్థలంలో పక్కా భవణాలు నిర్మించుకున్నా వాటి జోలికి పోలేని అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఆక్రమణలు తొలగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మిగతా ఆక్రమణలు తొలగించాలని, లేకపోతే అధికారులు చూపుతున్న పక్షపాత వైఖరిపై ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు.










