Dec 12,2022 22:19

నేలకొరిగిన తమలపాకు పంట పొలంలో లక్ష్మమ్మ, పంట పోలాన్ని పరిశీలిస్తున్న సుధాకర్‌ రావు ఎంపీడీవో , సిబ్బంది

వీడని వర్షం..!
మరో 48 గంటలు అప్రమత్తం
లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు
పారదర్శకంగా నష్ట అంచనాలు
కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం

మాండూస్‌ తుపాను నేపథ్యంలో చిత్తూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోద య్యింది. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతూనే, చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. పంట నష్టం అంచనాలను పారదర్శకంగా వేయాలని ఆదేశించారు.
సోమవారం జేసీ ఎస్‌.వెంకటేశ్వర్‌, డిఆర్‌ఒ ఎన్‌.రాజశేఖర్‌లతో కలిసి తుపాను సహాయ చర్యలు, నష్టాల అంచనాలపై ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని జడ్‌పిసిఇఒ, ఆర్‌డబ్ల్యుఎస్‌, మున్సిపల్‌ కమిషనర్లు, పబ్లిక్‌ హెల్త్‌ శాఖ వారు పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే మార్గాల్లో వాగులు, వంకలు పారుతున్న ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్‌ ట్యాంకుల స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నీరు మొరవ పారే ప్రదేశాలను గుర్తించి వెంటనే స్పందించా లన్నారు. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లయితే వారిని సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లి పర్యవేక్షించాలన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా నివారించాలని ఆదేశించారు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కల్వర్టులు, కాజ్‌వేల వద్ద సిబ్బందిని నియమించి పర్యవేక్షిస్తున్నామని నగరి ఆర్‌డిఒ కలెక్టర్‌కు వివరించారు. చిత్తూరు, గుడిపాల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయ్యిందని, సహాయ చర్యల్లో తహశీల్దార్లకు తగు సూచనలు చేసి వారి సమన్వయంతో సమాయ చర్యలు చేపడుతున్నామని చిత్తూరు ఆర్డీవో తెలిపారు. గార్గేయ, కౌండిన్య, పాలారు నదుల్లో నీటి ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అప్రమత్తం చేసి నీటి ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్న ప్రదేశాల్లో వాగులు, వంకలు దాటకుండా చూస్తున్నామని పలమనేరు ఆర్డీవో వివరించారు.
కార్వేటినగరంలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. కూలీలకు పనులు లేక ఇబ్బందులు తప్పలేదు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన చెరకు కూలీల ఇబ్బందులు వర్ణనాతీతం. వృద్ధులు ఈదురుగాలులు తట్టుకోలేక వణుకుతున్నారు. ఎక్కడికక్కడ నీరు నిలిచి కుంటలను తలపిస్తోంది. పంటలు నేలకొరిగాయి. దిగువ ప్రాంతాలైన సురేంద్రనగరం, డిఎంపురం, కెఎం పురం, కొటార్వేడు, గోపిశెట్టిపల్లి, లక్ష్మీరాజపేట పంచాయతీల్లో తీవ్రత అధికంగా ఉండడంతో మిరప, వేరుశనగ పంటలు నీటమునిగాయి. అదేవిధంగా యర్రమరాజుపల్లి, గాజంకి, కెపి అగ్రహారం, జాండ్లపేట గ్రామాల్లో తుపాను దాటికి వేరుశనగ పంట నీట మునిగింది. తుమ్మలచెరువు కాల్వ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గంటావారిపల్లికి చెందిన లక్ష్మమ్మ తమలపాకు తోట నేలకొరిగింది. రామకుప్పం మండల పరిధిలోని మణింద్రం పంచాయతీ అత్తికుప్పం గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆచారి, పద్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ చిన్నపాటి ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇంటిగోడలు సోమవారం ఒక్కసారిగా పెద్దశబ్దం చేస్తూ కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. నిలువ నీడ లేకుండా పోయిందని ఆ దంపతులు వాపోతున్నారు.
పారదర్శకంగా పరిహారం
తుపాను పరిహారం అంచనా విషయంలో కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతాదృక్పథంలో వ్యవహరించాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంటలు దెబ్బతిన్నచోట మళ్లీ పంటలు వేసుకోడానికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఇళ్లు ముంపుకు గురైతే ఆ కుటుంబానికి రెండువేల రూపాయలతో పాటు, రేషన్‌ అందించాలన్నారు. పశువులు చనిపోతే సత్వరమే చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం అంచనాల నమోదు ప్రారంభించి వారం రోజుల్లో సాయం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారా యణన్‌, ఎస్‌పి వై.రిశాంత్‌రెడ్డి, జెసి డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రాథమిక అంచనా ప్రకారం వ్యవసాయ రంగంలో 26 మండలాల్లో 170 గ్రామాల్లో 3,384 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఉద్యానవన శాఖకు సంబంధించి 149.6 హెక్టార్లలో టమోటా, బంగాళదుంప, మిరప దెబ్బతింది.
సిపిఎం అభినందనలు
చిత్తూరుఅర్బన్‌: మండోస్‌ తుపాన్‌ ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉన్నప్పటికీ కలెక్టర్‌ జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని ముందుగా అప్రమత్తం చేయడం వలన ప్రజలు క్షేమంగా ఉన్నారని, అధికారులకు సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ గత అనుభవాలను దష్టిలో పెట్టుకొని జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. జిల్లా 31 మండలాల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్‌ స్వయంగా వర్షంలో పర్యటన చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, మరోపక్క చిత్తూరు నగరంలో మహిళా అధికారిని కమిషనర్‌ వర్షంలోనూ పర్యటన చేస్తూ చిత్తూరు నగర ప్రజల ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని పిల్లలు, ముసలి వాళ్లు మహిళలు వర్షానికి బయట తిరగవద్దని విజ్ఞప్తి చేశారు.