
* రైలు ప్రమాదంలో మూడుకు చేరిన మరణాలు
* కుశాలపురానికి చెందిన అసిస్టెంట్ లోకో పైలట్ మృతి
* జి.సిగడాంలో ఇద్దరు మహిళలు మృత్యువాత
* పలు రైళ్లు రద్దు, మళ్లింపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, జి.సిగడాం, పొందూరు : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ వద్ద ఈనెల 29న సంభవించిన రైలు ప్రమాదంలో జిల్లాకు చెందిన మృతుల సంఖ్య మూడుకు చేరింది. విశాఖ-పలాస పాసింజరు రైలులో అసిస్టెంట్ లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న సువ్వారి చిరంజీవి (36), గిడిజాల లక్ష్మి(45), టంకాల సుగుణమ్మ (65) మృతి చెందారు. పలువురు గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గుర్తించిన మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అందించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొచ్చిన అనంతరం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రైలు దుర్ఘటన నేపథ్యంలో జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారిమళ్లించారు.
ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్న సువ్వారి చిరంజీవి వృత్తి రీత్యా విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. తండ్రి సన్యాసిరావు, తల్లి అమ్మాజీ ప్రస్తుతం కుశాలపురంలోనే ఉంటున్నారు. అసిస్టెంట్ లోకో పైలట్‌గా చిరంజీవి డ్యూటీకి వెళ్లిన విశాఖ-పలాస పాసింజరు రైలు ప్రమాదానికి గురైందన్న వార్త తెలిసిన వెంటనే భార్య జ్యోత్స్నతో కలిసి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే చిరంజీవి మృతదేహాన్ని విజయనగరం ఆస్పత్రికి తరలించడంతో అక్కడకు వెళ్లారు. విగతజీవిగా పడి ఉన్న చిరంజీవి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. విజయనగరం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత అధికారులు సోమవారం ఉదయం మృతదేహాన్ని అప్పగించడంతో, స్వగ్రామానికి తీసుకొచ్చి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య జ్యోత్స్నతో పాటు రెండేళ్ల కుమారుడు నవదీప్ ఉన్నాడు. మృతునికి మూడేళ్ల కిందటే వివాహమైంది. విశాఖపట్నంలోని ఒక ప్రయివేట్ కళాశాలలో బిటెక్ చదివారు. రైల్వేశాఖ నిర్వహించిన లోకో పైలట్ పరీక్షల్లో ఎంపికై 2013లో విధుల్లో చేరారు. భర్త మరణంతో భార్య జ్యోత్స్న కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఏకైక కుమారుడు మృతి చెందారన్న వార్తను జీర్ణించుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. భార్య, తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. చిరంజీవి మృతితో కుశాలపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు మృత్యువాత
విశాఖపట్నంలో ఒక ఫంక్షన్‌కు వెళ్లిన వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. జి.సిగడాం మండలం ఎస్‌పిఆర్ పురం అగ్రహారానికి చెందిన గిడిజాల లక్ష్మి (45), మెట్టవలసకు చెందిన టంకాల సుగుణమ్మ (65) మృతి చెందారు. టంకాల సుగణమ్మ భర్త సన్యాసినాయుడు చాలా ఏళ్ల కిందటే మరణించారు. కొడుకు ఆదాం పాలకొండలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. మృతురాలు ఒక్కరే గ్రామంలో ఉంటున్నారు. గిడిజాల లక్ష్మి ప్రమాదం సంభవించిన వెంటనే మృతి చెందిన విషయం విదితమే. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం స్వగ్రామాలకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలను చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
రైలు ప్రమాద దుర్ఘటనలో జిల్లాకు చెందిన పలువురు గాయపడ్డారు. జి.సిగడాం మండలానికి గాయపడిన మజ్జి సూర్యకాంతం, కీర్తి రాములమ్మ, మహంతి ఆదిలక్ష్మి, మహంతి తేజేశ్వని, మజ్జి అమృత, మజ్జి మోక్ష, మజ్జి రమణ విజయనగరం, కొత్తవలస ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందిన బొడ్డేపల్లి తేజేశ్వరరావుకు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు విశాఖపట్నంలోని రైల్వే ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పని మీద విశాఖపట్నం వెళ్లిన ఆయన రైలులో తిరిగి వస్తుండగా ప్రమాదంలో గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమదాలవలస మండలం బెలమాంకు చెందిన పంచాది శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కాగా విశాఖ రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రజాప్రతినిధుల పరామర్శ
రైలు ప్రమాదంలో జిల్లాకు చెందిన పలువురు గాయపడిన నేపథ్యంలో వైసిపి, టిడిపికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు విజయనగరం ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు, నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జి.సిగడాం తహశీల్దార్ వేణుగోపాలరావు, ఆర్‌ఐ రామచంద్రరావు విజయనగరం ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
పలు రైళ్లు రద్దు, దారిమళ్లింపు
రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. భువనేశ్వర్-ముంబై (కోణార్క్) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. కొన్నింటిని వేరే మార్గంలో పంపిస్తున్నారు. ముంబై-భువనేశ్వర్ రైలును విజయవాడ నుంచి మళ్లించారు. మరికొన్నింటిని ఆ మార్గంలోనే పంపిస్తున్నారు. ఒకే ట్రాక్‌కు క్లియరెన్స్ ఇవ్వడంతో షెడ్యూల్ కంటే ఐదారు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. హౌరా-సికింద్రాబాద్ (ఫలక్‌నుమా) ఎక్స్‌ప్రెస్ శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.13 గంటలకుకు రావాల్సి ఉండగా, అర్ధరాత్రి 12 తర్వాత వచ్చింది. దూర ప్రాంత రైళ్ల రాకపోకలకు వీలుగా పలు పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. రద్దయిన వాటిలో పలాస-విశాఖపట్నం పాసింజర్ స్పెషల్, విశాఖ-గుణుపూర్, గుణుపూర్-విశాఖ, పలాస-విశాఖపట్నం స్పెషల్‌ను రద్దు చేశారు. భువనేశ్వర్-విశాఖ, బరంపురం -విశాఖ నుంచి వెళ్లే ఇంటర్‌సిటీ రైళ్లను రద్దు చేశారు.