Jun 21,2023 22:39

పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ కె.శ్రీనివాసరావు

       బెలుగుప్ప : విధి నిర్వహణలో పోలీస్‌ సిబ్బంది, గ్రామ మహిళా పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశించారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఎస్‌ఐ రామకష్ణయ్యకు సూచించారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో మట్కా, పేకాట, నాటుసారా నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. సరిహద్దు ప్రాంతాలపై పోలీసు నిఘాను మరింత పెంచుతామన్నారు. మహిళా పోలీసులు గ్రామాల్లో సందర్శించి గహహింస, లైంగిక వేధింపులు చేసే వారిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ శేఖర్‌, ఎస్‌ఐ రామకష్ణయ్య పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.