Nov 02,2022 21:15

విద్యుత్‌ షాక్‌తో... ఒంటరి ఏనుగు దుర్మరణం
ప్రజాశక్తి - వి.కోట

అటవీ సరిహద్దు గ్రామాల రైతులు పంట వేస్తారేగానీ కంటిమీద కునుకు ఉండదు.. ఎపుడు ఏ అడవి జంతువులు పంటలపైకొచ్చి ధ్వంసం చేస్తాయోననే భయం వారిని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలోనే పంటలను కాపాడుకునే ప్రయత్నంలో ఫెన్సింగ్‌కు కరెంట్‌ పెట్టడంతో విద్యుత్‌ షాక్‌కు గురై మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు దుర్మరణం పాలయ్యింది. ఈ ఘటన వి.కోట మండల పరిధిలోని అటవీ సరిహద్దు ప్రాంతమైన గోనుమాకులపల్లి గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు...
నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎగ్గప్ప కుమారుడు సురేష్‌ తన పొలంలో మల్బరీ, టమోటా, వరి ఇతర పంటలు సాగు చేశాడు. అటవీ సరిహద్దు పొలం కావడంతో జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు పొలం సమీపంలోని రాఘవపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి గోనుమాకులపల్లికి 11 కెవి విద్యుత్‌ సరఫరా వెళుతోంది. దీనిగుండా రాత్రిపూట గ్రామాలకు సింగిల్‌ఫేజ్‌ సరఫరా ఉంటుంది. కట్టెకు ఇన్సులేటర్‌ కట్టి దాని సాయంతో అధిక తీవ్రత గల విద్యుత్‌ను వదిలేవాడని సమాచారం. మంగళవారం రాత్రి అటవీ సరిహద్దు వెంబడి మల్బరీ పంట పొలంలో అమర్చిన తీగలకు విద్యుత్‌ వదిలాడు. తోటకనుమ బీట్‌ పరిధిలో ఒలుకులంక అటవీ సమీపం నుంచి ఒంటరి మగ ఏనుగు ఆహారం కోసం పంట పొలాల్లోకి చొరబడింది. ఓ నూర్పిడి బండపై కుప్ప పోసిన వడ్లను ఆరగించి సురేష్‌ పొలాల్లోనుంచి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విద్యుత్‌ ఉచ్చుకు తగులుకుని అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన రైతు ఏనుగును పక్కనే గోయి తీసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అది కుదరకపోవడంతో గ్రామం విడిచి పారిపోయాడని తెలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ఏనుగును చూసేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. సంఘటనా స్థలాన్ని డిఎఫ్‌ఒ చైతన్యరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఒ నయీం అలీ, వి.కోట ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ రమేష్‌, వి.కోట సిఐ ప్రసాద్‌బాబు, విఆర్‌ నారాయణ పరిశీలించారు. తిరుపతి జంతుశాల అధికారి ఆధ్వర్యంలో ఏనుగుకు పంచనామా చేసి ఖననం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.