Jul 30,2023 22:23

సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల స్ట్రగుల్‌ కమిటీ ఛైర్మన్‌ పి.సుదర్శన్‌రెడ్డి

       అనంతపురం కలెక్టరేట్‌ : విద్యుత్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తక్షణం ఈ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజేషన్‌ చేయాలని ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ ఛైర్మన్‌ పి.సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని గణేనాయక్‌ భవన్‌ సిఐటియు కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ నాయకులు నబీరసూల్‌ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల స్ట్రగుల్‌ కమిటీ ఛైర్మన్‌ పి.సుదర్శన్‌ రెడ్డితో పాటు కన్వీనర్‌ బి.రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు సిఐటియు, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శులు నూర్‌మొహమ్మద్‌, రాజారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్ర కుమార్‌, సిఐటియు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం.నాగమణి, రాజేష్‌ గౌడ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్‌ సంస్థ, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంపుదల చేయడంలో జాప్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజేషన్‌ చేయాలన్నారు. ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు వేతనాలు ఎక్కువగా ఉంటున్నాయి, అందుకే సంస్థకు నష్టాలు వస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 15 శాతం మంది వేతనాలు పోల్చి మిగతా ఉద్యోగులందరికీ వేతనాలు ఎక్కువగా వస్తున్నాయని చూపడం సరికాదన్నారు. 24 గంటలు విధులు నిర్వహిస్తూ అనేక ప్రమాదాలకు విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు గురవుతున్నారని తెలిపారు. శ్రమ చేసే కార్మికుల పోస్టులు పెంచి భర్తీ చేయాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్‌లను నియమించినా నేటికీ వారు సచివాలయ ఉద్యోగులా, విద్యుత్‌ శాఖ ఉద్యోగులా తేల్చని పరిస్థితి నెలకొందన్నారు. శ్రమ దోపిడీకి గురువుతున్న ఉద్యోగులు, కార్మికులకు వేతన సవరణ జరగాలన్నారు. అన్‌లిమిటెడ్‌ హెల్త్‌ స్కీం అమలు చేయాలన్నారు. కన్వీనర్‌ రామలింగారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజేషన్‌ చేయాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్‌లు అందరినీ రెగ్యులరైజ్‌ చేసి విద్యుత్‌ సంస్థల్లో విలీనం చేయాలన్నారు. ఉద్యోగులందరికీ ఒకే మాస్టర్‌ స్కేల్‌ ఏర్పాటు చేయాలన్నారు. సిఐటియు, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శులు నూర్‌ మహమ్మద్‌, రాజారెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న మీటర్‌ రీడర్లందరిని గౌరవప్రదంగా జీవించే విధంగా వేతనాలు రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ సమస్యల అన్నింటిపై ఒక కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించామని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం నాయకులు రామచంద్ర, రమాదేవి, జిలానీ, సూరి, మధు, ఇబ్రహీం, చంద్ర, మీటర్‌ రీడింగ్‌ బిల్లింగ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు రమేష్‌, మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ ముత్తుజ ఇతర సంఘాల నాయకులు హాజరయ్యారు.