ప్రజాశక్తి - పెంటపాడు
పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు, నాయకులు బంకురు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యాన తాడేపల్లిగూడెంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి ఎఇ అడపా వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన విద్యుత్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి రాష్ట్ర అధికారాలను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుందని తెలిపారు. ఈ విధానాల వల్ల కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, అదనపు ఛార్జీలు, కరెంటు సుంకాలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఒక యూనిట్‌కు అదనంగా 80 పైసలు పెంచుతున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందన్నారు. తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తి కోదండరామిరెడ్డి కరక వెంకట్రావు, వర్రీ జోగి, దత్తు రాము, ఆదిరెడ్డి రాజేష్ మీసాల శ్రీను, తెర్లి రాజేష్, గేదాపు శంకర్ పాల్గొన్నారు.










