ప్రజాశక్తి-శింగనమల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ పేదలు, రైతుల నడ్డి విరుస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.బాలరంగయ్య విమర్శించారు. ఆదివారం మండలం పరిధిలోని సలకంచెరువు గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ముద్రించిన 'కరెంటు బిల్లులతో జనానికి షాక్' అనే కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ్నుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కళ్లు కప్పి దొడ్డిదారిన సర్దుబాటు పేరుతో అదనపు ఛార్జీలు వేస్తూ కార్పొరేట్ల జేబులు నింపుతున్నాయన్నారు. ఇప్పటి వరకు రెండేళ్లకో.. మూడేళ్లకో కరెంటు ఛార్జీలు పెంచేవారని, అయితే మోడీ ప్రభుత్వం ఆదేశాలకు తలొగ్గిన సిఎం జగన్ ప్రభుత్వం ప్రతినెలా వంటగ్యాస్ లాగానే కరెంటు ఛార్జీలను కూడా పెంచేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. కరెంటుకు బిల్లులే కాకుండా ఫిక్స్, కస్టమర్, సర్, సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్ సుంకం అంటూ రకరకాల పేర్లు పెట్టి జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. అసలు ఛార్జీల కంటే కోసరు ఛార్జీలే ఎక్కువ అయ్యాయన్నారు. రాజకీయ అవినీతిపరులు, కార్పొరేట్ పాలకులు కుమ్మక్కై రూ.2, రూ.3కు కొనాల్సి విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.20కి కొంటున్నారన్నారు. ఇందులో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటున్నా ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా హిందుజా సంస్థకు రూ.1200 కోట్లు చెల్లించడం బాధాకరమన్నారు. దీనికితోడు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి విద్యుత్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఎసరు పెట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. 200 యూనిట్లలోపు వాడే వారందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని మాట చెప్పి జగన్ మోసం చేశారన్నారు. మీటర్లు ఏర్పాట చేసేందుకు అదానీ కంపెనీకి కాంట్రాక్టు ఇస్తున్నారన్నారు. మీటర్లు బిగించిన తర్వాత ఏ గంటకు ఎంత కరెంటు వాడేమో తెలుస్తుందన్నారు. భవిష్యత్‌లో డిమాండ్‌ను బట్టి గంట గంటకూ ఒక్కో రేటు నిర్ణయించే ప్రమాదం ఉందన్నారు. రాత్రిపూట ఎక్కువ రేటు ఉండే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందుకే స్మార్ట్ మీటర్లు కొంపముంచేందుకు రెడీ అవుతున్నాయన్నారు. అందుకే వీటిని ఆదిలోనే తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వీటిపై రానున్న రోజుల్లో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్, నాయకులు సుంకన్న, లక్ష్మీనారాయణరెడ్డి, ఓబిరెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసులు, మేకల పెద్దన్న, పుల్లన్న, రామాంజనేయులు, వెంకటనారాయణ, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, నాగరాజు, చెంగల్ ధనుంజయ, వెంకటనారాయణ, రాముడు, కుళ్లాయిస్వామి, గంపన్న, పెద్ద ఆంజనేయులు, అప్పరాజు, దొడ్ల అయ్యప్ప, రామదాసు, రాముడు, కొండమ్మ పాల్గొన్నారు.
కరపత్రాలు విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు










