Apr 10,2023 21:03

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
వైసిపి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారాలు వేస్తోందని టిడిపి జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి తెలిపారు. పట్టణంలోని ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లోని సబ్‌స్టేషన్‌ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోనని అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు ఛార్జీలు పెంచి రూ.57,188 కోట్లు లూటీ చేసి రాష్ట్ర ప్రజలను మోసగించారని విమర్శించారు. డ్వాక్రా, అంగన్వాడీ సంఘాల రాష్ట్ర ప్రధానకార్యదర్శి మేరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్‌, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో వీరవాసరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్‌, వీరవల్లి శ్రీనివాస్‌, భీమవరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేపు వెంకన్న, కౌరు పృధ్విశంకర్‌, భీమవరం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం:రాష్ట్రంలో ఏడు సార్లు విద్యుత్‌ ఛార్జీల పెంపుతో వినియోగదారులపై రూ.17,093 కోట్ల భారం పడిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు విమర్శించారు. రాయపేటలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రామరాజు ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో 9,529 మెగావాట్ల సామర్థ్యాన్ని చంద్రబాబు నాయుడు 2018 నాటికి 19080 మెగావాట్లకు పెంచి జగన్‌ రెడ్డికి మిగులు విద్యుత్‌ ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పదివేల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం పెంచారని తెలిపారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల మల్లికార్జునరావు (బాబ్జి) ఆధ్వర్యంలో స్థానిక జయలక్ష్మి థియేటర్‌ వద్ద ఉన్న సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పోతుల అన్నవరం, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్‌, కిలపర్తి వెంకట్రావు, దాసరి కృష్ణవేణి, సుందర రమాదేవి పాల్గొన్నారు.
గణపవరం : విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ టిడిపి మండల కమిటీ ఆధ్వర్యాన వరధరాజపురం సబ్‌స్టేషన్‌ వద్ద నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీల భారంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో. గ్రామ అధ్యక్షులు కూసంపూడి సురేంద్రకుమార్‌ రాజు, నాయకులు పల్లి వెంకటేశ్వరరావు, షేక్‌ బషీరుద్దీన్‌ కడగళ్ల చిన్న పాల్గొన్నారు.
తణుకు : మాజీ ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు సబ్‌స్టేషన్‌ వద్ద టిడిపి శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బినామీలకు అప్పజెప్పడానికి విద్యుత్‌ ఛార్జీలు పెంచారని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు వెంకటకృష్ణ మాజీ ఎఎంసి ఛైర్మన్‌ బసవ రామకృష్ణ, చుక్కా సాయి బాబా, గుబ్బల శ్రీనివాస్‌, పితాని మోహన్‌రావు పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ మండలంలోని యాళ్లవానిగర్వు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ టిడిపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హయాంలో కరెంటు వెలుగులు ఉంటే జగన్మోహన్‌ రెడ్డి హయాంలో ప్రతి ఇంట్లో చీకట్లు ఆలముకుంటున్న పరిస్థితి ఉందన్నారు. టివి, ప్రిజ్డ్‌, తదితర ఎలక్ట్రికల్‌ వస్తువులు వినియోగించుకోవాలంటే మహిళలు భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి రామ్మోహన్‌, కోడి విజయభాస్కర్‌, జిఎస్‌ఎన్‌ రాజు, మామిడిశెట్టి పెద్దిరాజు, గండేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆకివీడు : పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు డిమాండ్‌ చేశారు. ఎంఎల్‌ఎ మంతెన రామరాజు ఆధ్వర్యంలో ఐ.భీమవరం రోడ్డులోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ ఎఇ ప్రసాదరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్‌, మాజీ డిసిసిబి ఛైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) పాల్గొన్నారు.
ఉండి : ఆక్వా జోన్‌ నాన్‌ ఆక్వా జోన్‌ అనే బేధాలు లేకుండా ప్రతి ఒక్క ఆక్వా రైతుకూ విద్యుత్‌ సబ్సిడీని ఇవ్వాలని టిడిపి శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో విద్యుత్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి విద్యుత్‌ ఎఇ ముదునూరి మాధవరాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కరిమెరక నాగరాజు మాట్లాడారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని, జోన్‌లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పేరిచర్ల కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.
కాళ్ల : పెరిగిన విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా టిడిపి మండల అధ్యక్షులు గుండా బత్తుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాళ్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఎఇ పి.రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ల ఉప సర్పంచి పన్నాసి అబ్బులు, మాజీ సర్పంచి వీరవల్లి శ్రీనివాస్‌, మాజీ ఎంపిటిసి నడింపల్లి విశ్వనాధరాజు పాల్గొన్నారు.