
* 12న రౌండ్‌టేబుల్ సమావేశం
* 15న విద్యుత్ ఎస్‌ఇ కార్యాలయం వద్ద ధర్నా
* వామపక్షాల నాయకులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : స్మార్ట్‌మీటర్లు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల తొమ్మిది నుంచి 15వ తేదీ వరకు చేపడుతున్న ఆందోళనా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. నగరంలోని క్రాంతి భవనంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల డబ్బులను దోచుకుంటున్నారని, మరొకవైపు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ కార్పొరేట్ల జేబులు నింపుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన రౌండ్‌టేబుల్ సమావేశం, 15న ఎస్‌ఇ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ, దుకాణానికి స్మార్ట్ మీటరు పెట్టబోతున్నారని, దాని ఖర్చు పెట్టిన కనెక్షన్‌పై సుమారు రూ.13 వేలు ఉంటుందన్నారు. ఈ మొత్తాన్ని జనమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి నెలా రూ.120 నుంచి రూ.150 వరకు పదేళ్ల పాటు వినియోగదారుల నుంచి వసూలు చేస్తారని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. వామపక్ష నాయకులు వామపక్ష నాయకులు ఎల్ శ్రీనివాసరావు డోల శంకర్రావు నిమ్మల కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.