Jun 13,2023 22:01

ఎస్‌ఇకి వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా విద్యుత్‌ ఛార్జీలను పెంచి జనం నడ్డివిరుస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నగర 2వ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం నగర 2వ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు ముత్తుజా అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు రాంభూపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో ఏడు సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిందన్నారు. ట్రూఅఫ్‌ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్‌ సుంకం, సర్‌ ఛార్జీ ఇలా అనేక రూపాల్లో ప్రజల నుంచి సుమారు రూ. 25 వేల కోట్లు ముక్కుపిండి వసూలు చేసిందని విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు వినియోగించిన కరెంటుకు నేడు సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణం పెంచిన అన్ని రకాల ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో రూ.13 వేల కోట్లు గహ వినియోగదారులకు, మరో రూ.6888 వేల కోట్లు వ్యయంతో, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు ప్రభుత్వం అమర్చబోతోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం స్మార్ట్‌ మీటర్ల ముసుగులో కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ మొత్తం ప్రజాధనం మళ్ళీ ప్రజలపైనే ఛార్జీల రూపంలో వేయనున్నారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఎస్‌ఇకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌ రెడ్డి, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్ఫాన్‌, నగర కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, అన్వర్‌, సిఐటియు న్యూనగర అధ్యక్షుడు గురురాజు, మున్సిపల్‌ యూనియన్‌ నగర కార్యదర్శి తిరుమలేష్‌, ఆటో యూనియన్‌ న్యూనగర అధ్యక్షుడు ఆజాం, లింగారెడ్డి, గఫూర్‌, శీన పాల్గొన్నారు.