
* వామపక్ష నాయకుల హెచ్చరిక
* కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాలను ఉపసంహరించుకోకుంటే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. విద్యుత్ బిల్లులు తగ్గించాలి ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక ధరలు, అదనపు భారాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు పాలకులు విద్యుత్ ఛార్జీలను పెంచి అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా విద్యుత్ ఛార్జీల పెంపు, శ్లాబులు మార్చి భారాలు మోపడం, ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్‌ఛార్జీలు, కస్టమర్ చార్జీలు, ఫిక్సిడ్ ఛార్జీలు, విద్యుత్ సుంకం పెంచడం, సర్దుబాటు ఛార్జీల పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై వేశారని చెప్పారు. బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనిట్‌కు అదనంగా 40 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు. వినియోగదారులపై మరో రూ.1500 కోట్లు విద్యుత్ భారాలు మోపేందుకు విద్యుత్ శాఖ పంపిన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విధిస్తున్న సర్దుబాటు ఛార్జీల భారాలను రద్దు చేయాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇస్తూ సామాన్యులపై భారాలు వేస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ ప్రయోజనాలు తప్ప సామాన్యుల ఇబ్బందులు పట్టడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజలపై భారాలు వేసి ఆదాయాలు రాబట్టాలని ఆదేశాలు జారీ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయకపోతే అప్పుకు అనుమతిచ్చేది లేదని బెదిరిస్తోందని, ఈ విధానాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాలనే అమలు చేస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, చేతివృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాయితీని అందించాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్ల లోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలని కోరారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కె.మోహనరావు, నాయకులు పి.ప్రసాదరావు, కె.సూరయ్య, లక్ష్మి, శ్రీదేవి పాణిగ్రాహి, నందోడు, ఎం.గోవర్థనరావు, డి.పార్వతీశం, ప్రకాష్, సిపిఐ నాయకులు సిహెచ్.గోవిందరావు, ఎ.షణ్ముఖ, ఎం.కృష్ణమూర్తి, సిహెచ్.వెంకటరమణ, యుగంధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.