ప్రజాశక్తి-గుంతకల్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈనెల 30వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్తు శాఖ ఎడిఇ కార్యాలయం ఎదుట నిరసనలు తెలియజేయనున్నట్లు సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ తెలిపారు. శనివారం స్థానిక హంపిరెడ్డి భవనంలో సిపిఎం నాయకులు సాకే నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.4500 కోట్ల భారం మోపిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరింతగా సర్‌ఛార్జీ పేరుతో రూ.12వేల కోట్ల భారం మోపేందుకు సన్నద్ధం అవుతోందన్నారు. గతంలో విద్యుత్ భారాలను అధికంగా వినియోగించే సంపన్నులు, పరిశ్రమలకు పెరుగుదల అధికంగా ఉండేదని, ఇప్పుడు భారాన్ని పేద, సామాన్య ప్రజలపైనా ఒకే రీతిన మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడుతోందన్నారు. స్మార్టు మీటర్లు అదానీ కంపెనీ కోసమే తీసుకొస్తోందని మండిపడ్డారు. ప్రజలు కూడా గడప గడపకూ, జగనన్న సురక్ష పేరుతో వైకాపా నాయకులు, అధికారులు తమ ఇళ్ల వద్దకు వచ్చినపుడు ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పెంచిన విద్యుత్ భారాలను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల్ని కలుపుకుని పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు డి.శ్రీనివాసులు, పట్టణ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాసులు, కసాపురం రమేష్, సిపిఐ నాయకులు రామంజి, ఈశ్వరయ్య, మహిళా నాయకురాళ్లు రంగమ్మ, జ్యోతి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమేష్, వెంకీ, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు










