అనంతపురం :రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఈనెల 30వ తేదీన నిరసనలకు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఉదయం స్థానిక గణేనాయక్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాపర్, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు పెద్దన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలను ప్రజలపై మోపేందుకు సిద్ధపడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.4500 కోట్ల భారం మోపిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరింతగా రూ.12 వేల కోట్లు భారాన్ని సర్‌ఛార్జీ పేరుతో భారం మోపబోతోందని వెల్లడించారు. గతంలో విద్యుత్ భారాలను అధికంగా వినియోగించే సంపన్నులు, పరిశ్రమలకు పెరుగుదల అధికంగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు భారాన్ని పేద, సామాన్య ప్రజలపైనా ఒకే రీతిన మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడుతోందని చెప్పారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై రూ.50 వేల కోట్లు, వ్యవసాయ పంపుపెట్లకు రూ.18 వేల కోట్లు కలిపి మొత్తం రూ.68 వేల కోట్లు భారాన్ని మోపేందుకు సిద్ధపడుతోందని విమర్శించారు. స్మార్టు మీటర్లు ఆదానీ కంపెనీ కోసమే తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. మీటర్లు పెట్టడమే కాకుండా రాబోయే పది సంవత్సరాలు అదనపు భారాన్ని ప్రజలు భరించాల్సి ఉంటుందని వివరించారు. ప్రజలపై పడుతున్న ఈ భారాల వలన ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతారన్న విషయం అధికార వైసిపి నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలపై పడుతున్న భారాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఐక్య వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి ప్రజా సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఉద్యోగ, వ్యాపార సంఘాలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈనెల 27వ తేదీన నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అనంతరం 30వ తేదీన పవర్ ఆఫీసు వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ఉద్యోగ, కార్మికులతోపాటు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య , సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సిపిఐ న్యూడెమోక్రసీ నాయకులు వీరనారప్ప, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.










