Jul 30,2022 21:19

విద్యుత్‌ అధికారుల దౌర్జన్యం.. నిలదీసిన సిఐటియు
ప్రజాశక్తి- నగరి :
నగరి ప్రాంతంలో దాదాపు 10వేల మంది, ప్రత్యక్షంగాను మరో 30వేల మంది పరోక్షంగాను నేతవత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కరోనా కాలంలో మరమగ్గ కార్మికుల జీవితం అతలాకుతలమై ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈడీ (ఎలక్ట్రిసిటీ డ్యూటీ) చార్జీల పేరిట ఒక్కో కనెక్షన్‌ మీద దాదాపు రూ.1500ల నుంచి 4500ల మేరకు విద్యుత్‌ చార్జీలను పెంచేసి మరమగ్గ కార్మికుల మీద మరింత భారాన్ని మోపింది. ఈతీరును ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మరమగ్గ కార్మికులు దాదాపు వారం రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, అనంతరం సంబంధిత ప్రభుత్వ అధికారులైన ఎస్‌ఈ, డీఈలను కలిసి వినతిపత్రం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజాను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. ఈడీ చార్జీలను రద్దు చేసే విషయంపై విధ్యుత్‌శాఖా ఉన్నత అధికారులతో తాము మాట్లాడి చర్యలు తీసుకుంటామని మంత్రి రోజా మరమగ్గ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగినది. అయితే శనివారం విద్యశాఖ అధికారులు మరమగ్గ కార్మికుల ఇంట్లోకి వెళ్లి బలవంతంగా విద్యుత్‌ కనెక్షన్లను కట్‌ చేయడం జరిగింది. ఇంట్లో మగవారు బయటకు వెళ్లారు, వారు వచ్చేంతవరకు ఆగాలని మహిళలు ఎంతో ప్రాదేయపడిన కూడా పట్టించుకోని విద్యుత్‌ అధికారులు కనెక్షన్లను తీసేశారు. బాధితులు మరమగ్గ కార్మికుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు పెరుమాల్‌కు సమాచారం అందివ్వగా పెరుమాళ్‌, సీఐటీయూ నాయకులు షణ్ముగం, జగదీష్‌, మరమగ్గ కార్మికులను తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఏపీ డీసీఎల్‌ ఏడీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఏడి కార్మికులతో మాట్లాడుతూ ఈడి ఛార్జీలను తగ్గించేది లేదా రద్దు చేసేది తమ అధికార పరిధిలో లేదని, తమకు తమపై అధికారులు గానీ, మంత్రులు గాని ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అందువలన తమ అధికారులు కనెక్షన్‌ తీసేసారని సమర్థించుకునే పనిలో పడ్డారు. పెరుమాళ్‌ మాట్లాడుతూ ఈడీ ఛార్జీల రద్దు విషయంపై పలుమార్లు ఎస్‌ఈ, డిఈ, విధ్యుత్‌శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించామని, వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే మంత్రి మాటలను కూడా భేఖాతర్‌ చేస్తూ విద్యుత్‌ అధికారులు ఇంట్లోకి చోరపడి బలవంతంగా కనెక్షన్‌ను తీసేసిన తీరు దారుణమని వాపోయారు. విషయం తెలుసుకున్న యుటిఎఫ్‌ ఎమ్మెల్సీలు విటపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ.వెంకటేశ్వర్లు ఎస్‌ఈతో మాట్లాడి స్థానికంగా ఉన్న ఏడీ, డీఈలకు సమాచారం అందించేంతవరకు కనెక్షన్‌ తీసే ప్రక్రియను మానుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
విద్యుత్‌ కనెక్షన్‌ను దౌర్జన్యంగా తీసేయడం దారుణం
-వాడ గంగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు
ఈడీ ఛార్జీలను తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో కూడా విద్యుత్‌ శాఖ మంత్రికి వినతిపత్రం అందివ్వడంతో పాటు ఏపీడిసిఎల్‌ ఉన్నత అధికారులకు, ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశాం. విద్యుత్‌ అధికారులు బలవంతంగా కార్మికుల ఇంట్లోకి దూరి దౌర్జన్యంగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసేయడం చాలా దారుణం. ఈ చర్యను సిఐటియు తీవ్రంగా ఖండిస్తోంది. డీఈ, ఏడీలకు జీవో అందేవరకు అధికారులు సునితంగా వ్యవహరించాలి. లేనిపక్షంలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తునఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.