Oct 04,2023 22:17

చెక్కును అందజేస్తున్న దానేటి శ్రీధర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం: విద్యతోనే ఉన్నత భవిష్యత్‌ సాధ్యమని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ అన్నారు. పెద్దపాడులోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకులం కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చన్నారు. తానూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అబ్దుల్‌ కలాం సూత్రాలతో పిల్లలకు పుస్తకాలు అందజేశారు. చదువులో చురుగ్గా ఉన్న విద్యార్థులకు నగదు రూపంలో బహుమతులు అందించారు. రెసిడెన్షియల్‌ హాస్టల్‌లో కరెంట్‌ కోతల సమయంలో విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని ఇన్వెర్టర్లకు డాక్టర్‌ దానేటి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరుపున రూ.లక్ష చెక్కును అందించారు. బాగా చదువుకుని ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌ సీట్లు సాధించిన విద్యార్థుల విద్యా సంబంధిత ఆర్థిక సహాయాన్ని తమ ట్రస్టు అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిసిఒ బాలాజీ, ప్రిన్సిపల్‌ జ్యోతి, రమణమూర్తి, చిన్ననాయుడు, చలం తదితరులు పాల్గొన్నారు.