May 08,2023 20:53

విస్సాకోడేరు సర్పంచి బొల్ల శ్రీనివాస్‌
ప్రజాశక్తి - పాలకోడేరు
విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థీ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని విస్సాకోడేరు సర్పంచి బొల్ల శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఇదే పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా పనిచేసిన కొల్ల శ్రీనివాస రాజశ్రీ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, పిల్లలు అందజేసిన రూ.10 వేలు నగదు బహుమతిని సర్పంచి శ్రీనివాస్‌ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన పి.లత నాగశ్రీకి రూ.5 వేలు, ద్వితీయ స్థానం సాధించిన శ్రీఅఖిలకు రూ.3 వేలు, తృతీయ స్థానం సాధించిన లక్ష్మీ ప్రసన్నకు రూ.2 వేలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు అందించిన కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెఎఎస్‌.చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.