విద్యాసంస్థల బంద్ విజయవంతానికి పిలుపు
ప్రజాశక్తి - కావలి రూరల్ : కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం వారు పీజీ కాలేజీ వద్ద వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌కె మస్తాన్, ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ ఎస్ కే మున్న, డివైఎఫ్‌ఐ కావలి పట్టణ సెక్రెటరీ పసుపులేటి పెంచల నరసింహం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాకేష్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు దినేష్ మాట్లాడారు. అనేక మంది విద్యార్థి యువజన నాయకులు 32మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం 8వ తేదీ నాటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటాయని తెలిపారు. అదేవిధంగా 8న రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చినట్లు తెలిపారు. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీ అనుబంధంగా ఇనుము గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా నూతన పరిశ్రమలు ఏర్పాటు వంటి విభజన హామీలు అన్నింటిపై నిర్లక్ష్యం చేస్తూన్నా రాష్ట్రంలోని బిజెపి నేతలు మోడీని ఎందుకు అడగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారన్నారు. రాష్ట్ర విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించక పోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఆచరణలో పురోగతి లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎవైఎస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










