ప్రజాశక్తి-అనంతపురం జెఎన్‌టియు పరిధిలో విద్యను అభ్యశించే విద్యార్థులు ఉద్యోగాలు కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు సృష్టించే ఆలోచనలతో ముందుకెళ్లాలని ఉపకులపతి రంగజనార్దన పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ ఎస్‌వి.సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో 2023-24లో బిటెక్ మొదటి విద్యను అభ్యశించే విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంత జెఎన్‌టియులో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. మీరు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఇకపోతే జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా జెఎన్‌టియు విద్యాబోధన, సిలబస్‌లో మార్పులు చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. రెక్టార్ ఎం.విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంజినీరింగ్ చదివే సమయం చాలా విలువైందన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాల మీద పరిశోధనలు చేస్తూ తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కోడింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌పైన దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సి.శశిధర్, కోఆర్డినేటర్ టి.బాల నరసయ్య, సీనియర్ ఆచార్యులు హెచ్.సుదర్శనరావు, కె.బి.చంద్రశేఖర్, యూనివర్సిటీ డైరెక్టర్లు ఇ.కేశవరెడ్డి, పి.సుజాత, జి.వి.సుబ్బారెడ్డి, ఆర్.పద్మ సువర్ణ, వి.బి.చిత్ర, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణకాంతి, వివిధ విభాగాల అధిపతులు ఎస్.చంద్రమోహన్‌రెడ్డి, ఆర్.భువనవిజయ, ఎం.రామశేఖర్‌రెడ్డి, కె.ఎఫ్.భారతి, బి.దిలీప్‌కుమార్, కె.కళ్యాణి రాధా, బి.అజిత, బోధనా సిబ్బంది కె.మాధవి, డి.విష్ణువర్ధన్, ఎ.పి.శివకుమార్, జి.మమత, అరుణ, శారద, స్పోర్ట్స్ సెక్రటరీ బి.జోజిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జెఎన్‌టియు విసి రంగజనార్ధన










