ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ విద్యార్థులు మూఢ నమ్మకాలవైపు వెళ్లకుండా శాస్త్రీయ ఆలోచనలను పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ విద్యార్థి, యువజన రంగాలకు జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు కార్యక్రమంలో గేయానంద్ మాట్లాడుతూ దేశంలో విభిన్న కులాలు, మతాలు, జాతులు ఉన్నాయన్నారు. వారందరి ఆలోచన విధానం దేశ ప్రగతి, అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతం, కులం పేరుతో దేశంలో మత కలహాలను సృష్టించి మారణ హోమం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మత కలహాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా బావిభారత పౌరులుగా దేశంలో ఉన్న విద్యార్థి, యువత ముందుకు రావాలన్నారు. అలాగే మూఢనమ్మకాలు, మనువాదాన్ని పెంచి పోషించడం కోసం బిజెపి ప్రభుత్వం విద్యారంగంలో జాతీయ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. వాటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యచంద్ర, డివైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు నరసింహారెడ్డి, బాలకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్, అధ్యక్షులు శివ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రమేష్, వంశీ, తరిమెల గిరి, సూర్యప్రకాష్, వెంకీ, అశోక్, విజరు, రజిత, వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ గేయానంద్










