విద్యార్థులు నష్టపోకూడదు: డీఆర్‌ఓ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: విద్యార్థుల ఎవ్వరు నష్టపోకుండా కళాశాలల యజమాన్యం, సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవిన్యూ అధికారి యన్.రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక డిఆర్‌ఓ సమావేశం హాల్‌లో సాంఘిక, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమశాఖల అధికారులు, యూనివర్సిటీల ప్రతినిధులతో నవంబర్ 10న జగనన్న విద్యాదీవెన పంపిణీపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాదీవెనకు సంబంధించి సంబంధిత కళాశాలల యజమాన్యం, సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నవంబర్ 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జగనన్న విద్యాదీవెన నాలుగో విడత నిధులు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు బట్టన్ నొక్కి నిధులు జమచేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాలు సక్రమంగా ఉన్నాయా లేవని పరిశీలించాలన్నారు. తల్లుల ఖాతాలకు సంబంధించి ఆధార్ ఇతర ఏమైనా సమస్యలు ఉంటే వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా 75శాతం హాజరు ఉంటేనే విద్య దీవెన వస్తుందని, వాటినే రెన్యువల్ చేయాలన్నారు. తల్లులు ఖాతాలకు జమచేసిన ఏడు రోజుల్లోగా కళాశాలలకు ఫీజు చెల్లించేలా తల్లులకు అవగాహన కలిగించాలని సంబంధిత అధికారుల ఆదేశించారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన రాలేదని,కళాశాలల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థులను ఇబ్బందులు గురి చేస్తున్నారని స్పందన కార్యక్రమంలో విద్యార్థులు ఫిర్యాదులు చేయడం జరుగుతున్న దని ఇంకా పై ఈ లాంటి సమస్యలు రాకుండా చూడాలని సంబందితా అధికారులను ఆదేశించారు. జ్ఞానభూమి యాప్ లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే అలాంటి వాటిని కూడా పరిశీలించాలన్నారు. ప్రతి కళాశాలలు తప్పనిసనిగా రెన్యూవల్ చేసుకోవాలన్నారు. ప్రతి కళాశాలలో జగనన్న విద్యాదీవెనకు సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తప్పనిసరిగా ఈకెవైసీ చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి, ఎస్‌కె.రబ్బాని బాషా, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, ఆర్‌ఐఓ, జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, వివిధ యూనివర్సిటీల అధికారులు పాల్గొన్నారు.










