May 03,2023 09:01

ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతున్న ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి

         అనంతపురం : సాంకేతిక విద్యార్థులకు సామాజిక బాధ్యతనూ పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి సూచించారు. జెఎన్‌టియు విసి కాన్పరెన్స్‌ హాలులో సాంకేతిక విద్యార్థులు సమాజ అభ్యున్నతికి గ్రామాలకు వెళ్లి ఏవిధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై వర్చువల్‌ సమావేశాన్ని విసి రంగజనార్ధన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులకు సామాజిక బాధ్యత కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సమాజ అభ్యున్నతిలో విద్యార్ధుల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. సమాజం పట్ల వారి బాధ్యతను గుర్తెరిగి సమాజ సేవా ధక్పథం అలవరుచుకునేలా చేయవలసిన బాధ్యత ఆధ్యాపకులపై ఉందన్నారు.ఉన్నత చదువుల చదవటమే కాకుండా సమాజ సేవ చేయటం తప్పనిసరి అన్నారు. ఈ భావ ప్రతి విద్యార్థిలోనూ కలగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యార్ధుల సమాజసేవ అంశం విజయవంతం కావాలంటే అందరం కలిసి విద్యార్ధులకు తగిన విధంగా దిశానిర్ధేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో రెక్టార్‌ ఎం.విజయ కుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, వి.సుమలత, ఈశ్వర రెడ్డి, కేశవరెడ్డి, సురేష్‌ బాబు పాల్గొన్నారు.