May 02,2023 21:58

మాట్లాడుతున్న ఉన్నత విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగలింగారెడ్డి

          ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌   కళాశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచాలని ఉన్నత విద్యాశాఖ కడప ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్‌ నాగలింగారెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక కెటిఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాలర్‌షిప్‌లు తీసుకుని కళాశాలకు రాకుండా ఉండే విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులు కళాశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చూడాలన్నారు. అంతర్గత మార్కులు వేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.రఘురామమూర్తి, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.