అంగన్‌వాడీ సిబ్బందితో భోజన ఏర్పాట్లు - పిల్లలకు మరోసారి వైద్య పరీక్షలు
ప్రజాశక్తి - తణుకురూరల్
పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నెం.6లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన వెంటనే మండల విద్యాశాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేశారు. మంగళవారం విద్యార్థుల భోజనానికి అసౌకర్యం కలగకుండా అంగన్‌వాడీ సిబ్బందిని నియమించారు. మెనూ ప్రకారం పులిహోర ఇవ్వాల్సి ఉండగా జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని వైట్‌రైస్, బీరకాయ కూర వండిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. పలువురు తల్లిదండ్రులు మాత్రం మంగళవారం తమ పిల్లలను పాఠశాలకు పంపించలేదు. దీనిపై మండల విద్యాశాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎజెన్సీని రద్దు చేయడంతో విద్యార్థుల భోజనానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా అంగన్‌వాడీ సిబ్బందితో భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం కూడా విద్యార్థులందికీ పరీక్షలు చేయించామని తెలిపారు. పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కొద్ది రోజులపాటు నర్సులను, ఆశా వర్కర్లను నియమించామన్నారు. వారికి ఒఆర్‌స్ ప్యాకెట్లు ఇస్తున్నామని తెలిపారు.










